
2న తుది ఓటరు జాబితా
సంగారెడ్డి జోన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఓటరు జాబితా తయారీపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను జారీ చేయగా వార్డుల వారీగా కొత్త ఓటరు జాబితాను తయారు చేశారు.
ముసాయిదా ఓటరు జాబితా
జిల్లాలోని గ్రామ పంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన జాబితాను సిద్ధం చేసి వార్డుల వారీగా గురువారం ప్రచురించారు. 29న జిల్లాస్థాయిలో, 30న మండలస్థాయిలో మండల అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులతో ఓటరు జాబితాపై సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ముసాయిదా జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే 28 నుంచి 30 వరకు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్వీకరించిన అభ్యంతరాలు 31న పరిష్కరించనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్ధం చేసిన తుది ఓటరు జాబితాను వార్డులు పంచాయతీల వారీగా సెప్టెంబరు 2న విడుదల చేయనున్నారు.
కొనసాగుతున్న ప్రత్యేక పాలన
2024 సంవత్సరం జనవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగిసింది. అనంతరం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పట్నుంచీ గ్రామాల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. అందులోభాగంగా మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పంచాయతీ పాలన కొనసాగిస్తున్నారు.
తగ్గిన గ్రామ పంచాయతీలు, వార్డులు
జిల్లాలో పలు మండలాలతోపాటు గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో విలీనం చేయడంతో గతంలోకంటే జీపీలు, వార్డుల సంఖ్య తగ్గింది. త్వరలో మరిన్ని పంచాయతీలు తగ్గనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 25 మండలాల పరిధిలో 613 గ్రామపంచాయతీలున్నాయి. అందులో 5,370 వార్డులు ఉండగా 5,542 పోలింగ్ స్టేషన్లున్నాయి. జిల్లావ్యాప్తంగా 7,44,297 మంది ఓటర్లు ఉన్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల వారీగా కొత్తగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమైన తేదీల వారీగా సమావేశాలు నిర్వహించి, తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు. –సాయిబాబా, జిల్లా పంచాయతి అధికారి, సంగారెడ్డి

2న తుది ఓటరు జాబితా