
నాటి పోరాట ఫలితమే ఉచిత విద్యుత్
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేపడతామని, నాటి విద్యుత్ పోరాట ఫలితంగానే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కారాములు పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కేవల్‌కిషన్‌భవన్‌లో విద్యుత్ అమరవీరుల 25వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పోరాట మృతవీరులు విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ..2000లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అవలంబించిన ప్రజావ్యతిరేక విధానాలు, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉధృతమైన ఉద్యమాలు జరిగాయన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణకు, పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారని గుర్తు చేశారు. పాలక ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ఆగస్టు 28న బషీర్‌బాగ్ వద్ద ముగ్గురు అమరులను దుర్మార్గంగా కాల్చి చంపిందన్నారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దారుణంగా ఓడించారని గుర్తు చేశారు. దీంతో నేటీకీ ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలందరికీ ఉచిత విద్యుత్తును అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, కృష్ణ, నాయకులు అశోక్, రాజయ్య, శివకుమార్, బాలరాజు, ప్రవీణ్, విఠల్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.