
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో కురిసిన వర్షాలపట్ల అన్ని శాఖలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని రేణిగుంట, ఎర్రగుంట, మాసానుకుంట చెరువులను కలెక్టర్ సందర్శించారు. రేణిగుంట చెరువులో ఏర్పడిన గండిని పరిశీలించిన కలెక్టర్ తక్షణ మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగులు, చెరువులు, కుంటల వద్దకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. జిల్లాలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం కోసం 08455–276155 నంబర్‌కు కాల్‌చేయవచ్చని చెప్పారు. ఇంటింటా జ్వర సర్వేలు నిర్వహించాలని ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే సత్వర చికిత్సలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ రవీందర్‌రెడ్డి, సంగారెడ్డి తహసీల్దార్ జయరామ్, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలపై శ్రద్ధ
పాఠశాలలో మౌలిక వసతుల సదుపాయాలలో భాగంగా విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు తదితర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.