
ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలి
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
సదాశివపేట(సంగారెడ్డి): వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. విగ్రహాల నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ఉభచెరువును పోలీసు, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి గురువారం సందర్శించి అక్కడ చేపట్టనున్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ..నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ధేశిత సమయంలోనే నిమజ్జనం చేసేలా చూడాలని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కురుస్తున్న వర్షాలకు ఉభచెరువు కట్టరోడ్డుపై ఇతర రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చి వేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీస్పీ సత్తయ్యగౌడ్, సీఐ వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ శివాజీ, తహసీల్దార్ సరస్వతి, ఇంజీర్ రాజేష్ పాల్గొన్నారు.