
పరిమళించు పలుకు
● కవుల ఊహలకు కట్టిన భాష తెలుగు
● ప్రపంచంలో అధికులు మాట్లాడే భాషలో ఒకటి
● నేడు తెలుగుభాష దినోత్సవం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అమ్మ ఒడి నుంచి నేర్చిన మాటలు తేనె లొలుకు తెలుగు భాష. తెలుగు భాషలో ఎక్కడ మాట్లాడినా మన తెలుగోడికి మధురానుభుతిని కల్గిస్తాయి. ఎల్లభాషలలో మాతృభాష పరిమళం నయనానందం. మనం ఎక్కడ ఉన్న మన భాష, మనం మాట్లాడే మాటల్లో వ్యక్తం అవుతుంది. తెలుగులో మాట్లాడే విధంగా ఇతర భాషలో మాత్రం అంత స్పష్టంగా మాట్లాడలేము. తెలుగు అనేది కేవలం భావ వ్యక్తీకరణ కోసం ఉపయోగించే భాష మాత్రమే కాదు, యుగయుగాలుగా కవుల ఊహలకు రెక్కలు కట్టి, మన పండితుల జ్ఞానానికి పదును పెట్టిన భాష. మన జాతి ప్రాచీన వారసత్వానికి ప్రాణం తెలుగు భాష. ప్రపంచంలో అధికులు మాట్లాడే భాషల్లో మన తెలుగుభాషకు ప్రత్యేక స్థానం ఉంది. మన తెలుగు వారు ఎక్కడ ఉన్న అక్కడ మన తెలుగు వర్థిల్లుతుంది. అక్కడి భాష ఏదైనా మన తెలుగువారు కలుసుకున్నపుడు మాత్రం తెలుగులోనే మాట్లాడుతూ..
తెలుగును మరింత వ్యాప్తి చేయడం సంతోషించదగిన విషయం. శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జిల్లాలో తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలు, సంఘాలు, వ్యక్తులపై సాక్షి పాఠకులకు అందిస్తున్న ప్రత్యేక కథనం. తేనేలేను తెలుగు లోగిళ్లలో వికాస తరంగం. నిత్యం సాహిత్య పూదోటగా వికాసానికి తోడ్పడుతున్న మాగాణి. సాహిత్య సంపదకు నిలయమైన సిద్దిపేట జిల్లాలో అనేక సంఘాలు, సాహితీ సంస్థలు ముందుంటాయి. ముఖ్యంగా మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం, వెన్నెల సాహిత్య సంఘం, తెలంగాణ రచయితల వేదిక, సిద్దిపేట రచయితల సంఘం తదితర సంఘాలు, సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి.
ఈ సంస్థలు కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, సమావేశాలు, సాహిత్య గోష్టిలతో తెలుగు వెలుగులు నింపుతున్నాయి. శతాధిక కవులున్న సిద్దిపేటలో కవిత, పద్యం, కథ, మణిపూసలు, గేయాలు, వ్యాసాలు తదితర ప్రక్రియలలో తమదైన శైలిలో రచనలు చేయడంతో పాటుగా, పుస్తకాలు ముద్రిస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకున్నారు. సృష్టమైన తెలుగులో అక్షరబద్ధమైన రచనలతో చైతన్యం నింపుతూ తాము రచనలు చేయడంతో పాటుగా బాలలచే రచనలు చేయిస్తున్నారు. బాలకవులను తయారు చేస్తున్నారు. తెలుగుభాష పరిమళం సిద్దిపేట ఒడిలో ఓలలాడుతూ పలు భాషల ప్రక్రియల పట్ల అవగాహన తెచ్చేందుకు కృషి చేస్తున్న రచయితల స్ఫూర్తి అభినందనీయం. ఇలాగే సాహితీ క్షేత్రంగా సిద్దిపేట భావితరాలకు తెలుగుభాష మాధుర్యాన్ని పంచుతూ ముందుకు సాగుతుంది.