
పిల్లలను పోషించలేక..
● చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
● పండగ పూట విషాదం
మనోహరాబాద్(తూప్రాన్): చనిపోయిన భర్త జ్ఞాపకాలు మరవలేక, ఇటు పిల్లలను సాకలేక మనస్తాపం చెందిన ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని రంగాయపల్లికి చెందిన జంగం రజిత(33) భర్త నాగేష్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి భార్యకు కూతురు కూడా వీరి దగ్గరే ఉంటుంది. ముగ్గురు పిల్లలతో కలసి సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో ఒక్కసారిగా పిడుగులాంటి వార్త కుదుపేసింది. రెండేళ్ల క్రితం భర్త గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి పిల్లలను పోషించలేక, ఆర్థిక సమస్యలు భరించలేక బుధవారం వినాయక చవితి రోజు ఇంట్లోంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో మామ జంగం నర్సింలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం చెరువులో శవమై తేలింది. మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అప్పుల తీర్చలేక వ్యక్తి..
పటాన్‌చెరు టౌన్: అప్పుల బాధలు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి సాయి ప్రియ కాలనీకి చెందిన గుర్రం జాకబ్ (43) పటాన్‌చెరు మండలం రుద్రారంలోని తోషిబా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇటీవల బంధువుల దగ్గర అప్పులు తీసుకున్నాడు. 15 రోజులుగా పనికి వెళ్లకుండా ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 26న ఇంటి నుంచి బయటకు వెళ్లి అల్లుడు విక్రంకు లోకేషన్ పంపాడు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం అక్కడికి వెళ్లగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.