
పక్కదారి పట్టిందా!
జిల్లా వ్యాప్తంగా వేధిస్తున్న యూరియా కొరత
యూరియా కొరత కష్టాలు
●
హత్నూర మండలం దౌల్తాబాద్‌లో యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు
జిల్లాతోపాటు, రాష్ట్రమంతటా యూరియా కొరత వేధిస్తోంది. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద రోజంతా క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఒక్కోసారి రాత్రంతా పీఏసీఎస్‌లు, రైతుసేవా కేంద్రాల వద్ద జాగారం చేయా ల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా హత్నూర మండలంలో ఈ సమస్య అధికంగా ఉంది. పుల్కల్, చౌటకూర్, వట్‌పల్లి తదితర మండలాల్లో ఈ బస్తాల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఎరువుల అక్రమ రవాణా అంశం తెరపైకి వస్తోంది.
కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న న్యాల్‌కల్ మండలంలో గతేడాది ఖరీఫ్ సీజను మొత్తానికి యూరియా విక్రయాలు 1,300 మెట్రిక్ టన్నులు. ప్రస్తుత సీజను సగం కూడా పూర్తికాకముందే 1,505 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయి. సీజను పూర్తయ్యే నాటికి 2,500 మెట్రిక్ టన్నులు దాటే అవకాశాలున్నాయి.
బీదర్‌కు సమీపంలో ఉన్న మనూరు మండలంలో గతేడాది కేవలం 152 టన్నుల యూరియా అమ్మినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, ఈసారి ఇప్పటి వరకు విక్రయాలు 200 టన్నులు దాటింది. సీజను పూర్తయ్యే నాటికి మరో 200 టన్నుల అవసరం ఉంటుందని అంచనా.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మండలాల్లో యూరియా విక్రయాలు ఈ సీజనులో గణనీయంగా పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతేడాది ఖరీఫ్ సీజనుతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మండలాల్లో గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం రెట్టింపు కాలేదు. అలాంటప్పుడు రెట్టింపుస్థాయిలో యూరియా విక్రయాలు జరగడం చూస్తే ఇక్కడి నుంచి ఈ ఎరువు కర్ణాటకకు పక్కదారి పడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులకు పట్టుబడిన ఘటనలు
జిల్లాకు వచ్చిన ఈ ఎరువు సరిహద్దులు దాటే అవకాశాలు లేకపోలేదనే కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఆయా వస్తువుల ధరల్లో తేడాల కారణంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ సరుకులు అక్రమ రవాణా జరగుతుండటం ఈ ప్రాంతంలో పరిపాటే. ధరల్లో వ్యత్యాసం కారణంగా ఈ ఎరువులు, విత్తనాలతోపాటు, సిమెంట్ వంటి లారీలను కర్ణాటకకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు మండలాల్లో సాగు విస్తీర్ణం పెరగకపోయినా యూరియా విక్రయాలు రెట్టింపుస్థాయిలో జరుగుతుండటం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటక సరిహద్దు మండలాల్లో..
న్యాల్‌కల్, ఝరాసంగం, మొగుడంపల్లి, కోహీర్, కంగ్టి, నాగల్‌గిద్ద, సిర్గాపూర్, మనూర్ మండలాలు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నాయి. గతేడాది ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ఈ మండలాల్లో సాగు విస్తీర్ణం రెట్టింపు కాలేదు. అలాంటప్పుడు యూరియా అమ్మకాలు భారీగా పెరగడం వెనుక కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ప్రస్తుతం బీదర్‌లోనూ ఎరువుల కొరత ఉంది. దీంతో ఇక్కడి నుంచి యూరియా బీదర్‌కు అక్రమ రవాణా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
7.46 లక్షల ఎకరాల సాగు..
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజనులో 7.46 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగువుతున్నాయి. ఈసారి మొత్తం 38,872 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపింది. వ్యవసాయశాఖ కమిషనరేట్ జిల్లాకు సుమారు 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఇప్పటి వరకు 26,274 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. దీంతో జిల్లాలోనూ యూరియా సమస్య తలెత్తుతోంది.
సరిహద్దు మండలాలను
అప్రమత్తం చేశాం
సరిహద్దు మండలాల్లో యూరియా పక్కదారి పట్టే ఆస్కారం లేదు. చాలామంది రైతులు అవసరానికి మించి ఎరువులు వాడుతున్నారు. రానున్న రోజుల్లో యూరియా లభిస్తుందో లేదోననే ముందే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. సరిహద్దు మండలాలను కూడా అప్రమత్తం చేశాం.
–శివప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
26,274 మెట్రిక్ టన్నుల యూరియా ఏమైందో?
కర్ణాటక సరిహద్దు మండలాల్లో యూరియా విక్రయాలు రెట్టింపు!
సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట ప్రాథమిక సహకార సంఘం కేంద్రానికి మంగళవారం యూరియా వచ్చిందనే తెలియగానే రైతులు ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. యూరియా కోసం క్యూలో నిలబడి పడిగాపులు కాశారు. ఈ క్రమంలో యూరియా కోసం అధికారులతో రైతులు వాగ్వాదానికి కూడా దిగారు. అయితే ఈ కేంద్రంలో గత నాలుగైదు రోజులుగా యూరియా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి