
వసతుల కల్పన తప్పనిసరి
బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
● మంత్రి దామోదర రాజనర్సింహ
● నియోజకవర్గ విద్యా సంస్థల బలోపేతంపై సమీక్ష
జోగిపేట(అందోల్)/పటాన్‌చెరు టౌన్/ మునిపల్లి (ఆందోల్): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి, పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అందోల్ నియోజకవర్గంలోని విద్యా సంస్థల అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతంపై మంగళవారం మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సమీక్ష నిర్వహించారు. అవసరమైన వసతుల కల్పనపై ప్రిన్సిపాల్‌లు, అధికారులతో చర్చించారు. పుల్కల్, అందోల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అందోల్, శివ్వంపేట, సంగుపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలు, ఆక్సాన్‌పల్లి, పోతుల బొగుడ, బస్వాపూర్‌లోని మోడల్ స్కూళ్లు, అందోల్, సింగూర్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో సదుపాయాల గురించి మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విద్యార్థులకు వసతి, ఆహారం, క్రీడా సదుపాయాల నాణ్యతను మరింత మెరుగుపరచాలన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ, పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, బుదేరా విద్యాసంస్థల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, హాస్టల్లో వసతి సదుపాయాల పెంపు, ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు మాజీ డీసీసీ అధ్యక్షుడు డాకూరి గాలయ్య 35వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు.
వినాయక చవితి పురస్కరించుకుని ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేశ్‌గడ్డ దేవస్థానంలో జరుగనున్న బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రి దామోదరను ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ ఈవో లావణ్య, ఆలయ కమిటీ సభ్యులు సంగారెడ్డిలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.