
రేషన్ డీలర్ల పరేషాన్
● ఐదు నెలలుగా రాని కమీషన్ బకాయిలు
● రూ.15 కోట్లు ఇవ్వాల్సి ఉన్న ప్రభుత్వం
● 1 నుంచి రేషన్ దుకాణాల బంద్‌కు యోచన!
హత్నూర(సంగారెడ్డి): రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్న డీలర్లకు ఐదు నెలలుగా రావాల్సిన కమీషన్ బకాయిలను ప్రభుత్వం నిలిపివేయడంతో వారు ఇబ్బందులనెదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి కమీషన్ బకాయిలు విడుదల చేయకపోతే వారంతా ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమీషన్ బకాయిలు విడుదల చేయాలని రేషన్ డీలర్లు ఆందోళన చేసి తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. గత ఐదు నెలలకు జిల్లాలోని 846 రేషన్ దుకాణాలకు సంబంధించి సుమారు రూ.15 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. వీటికి అదనంగా రెండేళ్ల క్రితం రెండు నెలల గన్నీ బ్యాగులను ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వం వాటి తాలుకూ సుమారు రూ.6కోట్లను ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో డీలర్లు కనీసం రేషన్ దుకాణాల అద్దె, కరెంట్ బిల్లులు సైతం కట్టుకోలేక ఇబ్బందులుపడుతున్నారు.
క్వింటా బియ్యానికి రూ.140
క్వింటా బియ్యానికి డీలర్‌కు రూ.140 కమీషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే తాము అధికారంలోకి వస్తే రేషన్ డీలర్లకు నెలకు రూ.5000 గౌరవవేతనంతోపాటు క్వింటాకు రూ.300 కమీషన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీ మాట ఎలాగున్నా బకాయిలైనా సక్రమంగా చెల్లించాలని రేషన్ డీలర్లు వాపోతున్నారు. కాగా, ఈ నెలాఖరుకల్లా కమీషన్ బకాయిలతోపాటు గన్నీ బ్యాగుల డబ్బుల్ని ప్రభుత్వం చెల్లించకుంటే సెప్టెంబర్ 1 నుంచి జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్‌కు డీలర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.