
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి
నారాయణఖేడ్/కల్హేర్(నారాయణఖేడ్): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. నిజాంపేట్ మండలం రాంరెడ్డిపేట్‌లో మంగళవారం గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ వాసులకు వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత బీఆర్‌ఎస్ సర్కారు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు చిన్నచిన్న మరమ్మతులను చేయకుండా దుర్మార్గపు పాలన చేశారని మండిపడ్డారు. పర్యావరణ కాలుష్యం మానవాళికి శాపంలా మారుతోందని ప్రతీ ఒక్కరూ మట్టివినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనరు జగ్జీవన్, మాజీౖ చెర్మన్ ఆనంద్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ కౌన్సిలర్లు రామకృష్ణ, హన్మాండ్లు, మాజీ సర్పంచ్ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.