
63 లక్షల గంజాయి పట్టివేత
ఇద్దరి అరెస్ట్.. రెండు కార్లు స్వాధీనం
సంగారెడ్డి: ఆంధ్రా ఒడిశా బార్డర్ నుంచి రెండు కార్లలో గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డి డీటీఎఫ్ టీం పట్టుకుంది. సోమవారం కేసుకు సంబంధించిన వివరాలను మెదక్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ వెల్లడించారు. ఏవోబీ నుంచి గంజాయి మహారాష్ట్రకు వెళుతుందనే సమాచారంతో సంగారెడ్డి కంది మండలం చేర్యాల గేటు వద్ద కాపు కాసి మహారాష్ట్రకు చెందిన వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారును తనిఖీ చేస్తుండగా కారు డిక్కీలో, బాడీ కింద ప్రత్యేకమైన అరలు చేయించి గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఒక కారులో 69.5 కేజీలు, మరో కారులో 53.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 63 లక్షలుంటుందని తెలిపారు. నిందితులు అబ్దుల్ వహాబ్ సయ్యద్, ఉమాకాంత్ సబర్‌ను అరెస్ట్ చేశారు. చాంద్ మహమ్మద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. డీటీఎఫ్ సీఐ శంకర్, నజీర్ పాషా, సిబ్బంది, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్రను అభినందించారు.