
మట్టి గణపతిని పూజిద్దాం
విగ్రహాలను పంపిణీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని కలెక్టర్ ప్రావీణ్య కోరారు. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో సంస్థ అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్‌తో కలిసి కలెక్టర్ చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేలకు పైగా విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు సంస్థ అధ్యక్షుడు తోపాజి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో వాయు, నీటి కాలుష్యాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
అన్ని శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు సంక్షేమ వసతి గృహాలు తనిఖీ చేసి, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. మహోత్సవంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని వివరించారు.
ప్రజావాణికి 35 అర్జీలు
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎపపటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 35 అర్జీలు వచ్చాయి. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. వినతులు స్వీకరించిన వారిలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డీఆర్‌ఓ పద్మజరాణి పాల్గొన్నారు.