
సార్.. ప్లానింగే వేరు!
● ఎప్పుడొస్తారో తెలియదు
● టౌన్‌ప్లానింగ్ అధికారి తీరుపై విమర్శల వెల్లువ
సంగారెడ్డి: ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు సమయపాలన పాటించకుండా ‘మా రూటే.. సెపరేటు..’అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తామొచ్చిందే టైం, చేసిందే పనిగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సంగారెడ్డి బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారి మధ్యాహ్నం 12 గంటలు దాటినా విధులకు హాజరు కావడం లేదు. తన లెక్కేవేరు అన్నట్టు వ్యవహరిస్తున్న సదరు అధికారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 10 గంటలకే కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆయన రాక కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్కోసారి సాయంత్రం వరకు కూడా ఆయన దర్శనం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారంలో రెండు రోజులే వస్తారని, అది కూడా సమయానికి రారని వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించేలా, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.