
హైవేలపై అండర్‌పాస్‌లు
● మంత్రి దామోదర రాజనర్సింహ
● అధికారులతో కలిసి పరిశీలన
వట్‌పల్లి(అందోల్): నాందేడ్–అకోలా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చోట అండర్‌పాస్ బ్రిడ్జిలను నిర్మించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం హైవే అధికారులతో కలిసి 161 జాతీయ రహదారిని పరిశీలించారు. అందోల్ మండలం డాకూర్ వంతెన వద్ద అండర్‌పాస్ లేకపోవడంతో డాకూర్ వెళ్లే గ్రామాల ప్రజలు సుమారు 6 కి.మీల దూరం సర్వీసు రోడ్డు ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. ఇలా హైవేపై రానుపోను అదనంగా 12 కి.మీల దూరం ప్రయాణం చేస్తున్నారు. ఇబ్బందులు పరిగణలోకి తీసుకొని డాకూర్ వద్ద అండర్ పాస్, అల్మాయిపేట వద్ద వంతెన ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ పాండు, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి, తహసీల్దార్ మధుకర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.