
మూడు గ్రామాలకు ఒక ఎంపీపీ, వైస్ ఎంపీపీ
భానూరు గ్రామ పంచాయతీని బల్దియాగా మార్చాలనే నిర్ణయానికి బ్రేక్ పడిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో రక్షణ శాఖకు సంబంధించిన సంస్థ బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) ఉంది. దీంతో ఈ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలంటే కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి అయింది. ఈ కారణంగానే ఈ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది.
– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి:
తొలుత భానూరు, నందిగామ, క్యాసారం గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా మార్చాలని భావించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అలాగే ఈ గ్రామాలను కొత్తగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయాలనే మరో ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనకు వెళ్లింది. కానీ కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో కోహీర్, జిన్నారం వంటి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. అంతకుముందు ఇస్నాపూర్‌ను కూడా మున్సిపాలిటీ చేసింది. ఈ క్రమంలోనే భానూరును కూడా మున్సిపాలిటీగా మార్చాలని భావించినప్పటికీ, కేంద్రం నుంచి అనుమతి తప్పనిసరి కావడంతో ఈ ప్రతిపాదనలకు బ్రేక్ పడినట్లయింది.
పటాన్‌చెరు మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 16 గ్రామ పంచాయతీలు వివిధ మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ఇప్పుడు ఈ గ్రామాలు మాత్రమే పటాన్‌చెరు మండలంలో కొనసాగనున్నాయి. ఈ మూడు గ్రామాలకు ఒక ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలు ఉంటాయి. అలాగే ఐదు ఎంపీటీసీ స్థానాలతో ఈ మండల పరిషత్‌ను ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనల ప్రకారం 2,500 నుంచి మూడు వేల వరకు ఓటర్లకు ఒక ఎంపీటీసీ స్థానం ఉంటుంది. అలాగే మండల పరిషత్ ఏర్పడాలంటే కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలి. భానూరులో సుమారు పది వేల వరకు జనాభా ఉండటంతో ఈ గ్రామం పరిధిలో మూడు ఎంపీటీసీలు, క్యాసారం, నందిగామ గ్రామాలకు ఒక్కో ఎంపీటీసీ స్థానం చొప్పున మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాలతో ఈ మండల పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ఈ మండలానికి ఓ జెడ్పీటీసీ స్థానం కూడా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఐదు ఎంపీటీసీ స్థానాలకు, ఒక జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.