
రారు.. పట్టించుకోరు
కార్యదర్శుల గ్రామాల సందర్శనేది?
పంచాయతీ కార్యదర్శులు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు లేకపోవడంతో కార్యదర్శులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ సమస్యలను గాలికొదిలేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో ఎంతో కీలకమైన పారిశుద్ధ్యం, రిజిస్టర్ల నిర్వహణ వంటి పనులు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
● విధుల పట్ల నిర్లక్ష్యం..నిలిచిపోయిన పనులు
● గ్రామాల్లో పడకేస్తున్న పారిశుద్ధ్యం
నారాయణఖేడ్: గ్రామాల్లో ప్రధాన ప్రథమ అధికారి పంచాయతీ కార్యదర్శి. తనకు కేటాయించిన గ్రామానికి సదరు కార్యదర్శి వెళ్లి ముఖగుర్తింపు హాజరును లైవ్ లొకేషన్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ, చాలామంది కార్యదర్శులు గ్రామాలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటూ ముఖగుర్తింపు హాజరును నమోదు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోతో ఇటీవల హాజరు నమోదు చేసిన ఘటన పత్రికల్లో రావడంతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా 553మంది పంచాయతీ కార్యదర్శులు నకిలీ హాజరు నమోదు చేసుకొన్నట్లు గుర్తించారు. ఇందులో 15మందిని సస్పెండ్ చేయగా మిగతావారికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. జిల్లాలోనూ ఇదే పరిస్థితి చాలా పంచాయతీల్లో కన్పిస్తోంది. కొన్ని పంచాయతీలకు కార్యదర్శులు ఇన్‌చార్జిలుగా కూడా ఉన్నారు. గ్రామాలకు సర్పంచ్‌లు ఉన్న సమయాల్లో విధులు బాగా నిర్వర్తించిన వీరంతా ఇప్పుడు ఆయా ఊళ్ల ముఖమే చూడటం లేదు. ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడి సమస్యలు అక్కడే అపరిష్కృతంగా ఉంటున్నాయి.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడుగా, గ్రామాభివృద్ధిలో కార్యదర్శులు భాగస్వాములు కావాలి. అయితే గ్రామాల్లో సర్పంచ్‌లు లేనికారణంగా పారిశుద్ధ్య, ఇతర కార్మికులతో పనులు కానిచ్చేస్తున్నారు. ఎప్పుడో చుట్టపుచూపుగా గ్రామాలకు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. ప్రజలకు ఏదైనా పని ఉంటే వారికోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. కొందరు కార్యదర్శులకు మండల పరిషత్తుల్లో, ఉపాధి హామీ కార్యాలయంలోనే కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ విధులు...
పంచాయతీ కార్యదర్శి విధుల్లో భాగంగా గ్రామానికి తాగునీటి సరఫరాను చేపట్టాలి. పారిశుద్ధ్యం, జనన, మరణాల నమోదు, ఇంటి పన్ను వసూళ్లు, ఇంటి నిర్మాణ అనుమతులు, వృత్తి, వ్యాపార లైసెన్సుల జారీ, పంచాయతీ కార్యాలయ నిర్వహణ, ఉపాధి హామీ పథకం పనుల పరిశీలన వంటి పనులు చేపట్టాలి. వీటితోపాటుగా ప్రతీ గ్రామ పంచాయతీలో 58 రకాల రిజిస్టర్లను నిర్వహించాలి. అయితే కార్యదర్శులు గ్రామాలకు ముఖం చాటేస్తుండటంతో ఈ రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా జరగడంలేదు. పర్యవేక్షించాల్సిన మండల పరిషత్, జిల్లా స్థాయి అధికారులు కూడా వారి కార్యాలయాలకే పరిమితమవుతుండటంతో గ్రామాలు సమస్యల్లో కొట్టు మిట్టాడుతున్నాయి.