
శిఖం భూమి కబ్జా
హత్నూర(సంగారెడ్డి): రెవెన్యూ అధికారులు కేసులు పెట్టినా...చర్యలు తీసుకున్నా శిఖం భూ కబ్జాదారులు వ్యవసాయం వరి నాట్లు వేయడం మాత్రం మానడం లేదు. ఈ ఘటన మండల కేంద్రమైన హత్నూర గ్రామ శివారులోని తాళం చెరువు శిఖం భూమి సుమారు ఐదెకరాల వరకు కబ్జా చేసి అందులో బోర్లు వేసి వరినాట్లు వేశారు. హత్నూర గ్రామ శివారులో ఉన్న తాలిం చెరువు శిఖంలో బ్రాహ్మణగూడ గ్రామానికి చెందిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని గత ప్రభుత్వంలో అధికారులు ఏర్పాటు చేశారు. క్రీడా మైదానానికి పైభాగంలో నర్సరీతోపాటు మరికొంత శిఖం భూమి రోడ్డుకు ఆనుకుని ఉంది. కొంతమంది శిఖం భూమిలో బోర్లు సైతం వేసి భూమిని కబ్జా చేసి కొన్నేళ్లుగా వరి నాట్లు వేస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారు. గతేడాది హత్నూర గ్రామానికి చెందిన రైతులు కబ్జాకు గురైన శిఖం భూమిని కాపాడాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా కబ్జా చేసిన వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం శిఖం భూమిలో దర్జాగా బోర్లలో మోటార్లు దించి వచ్చిన నీటి ద్వారా శిఖం భూమిలో యథేచ్ఛగా తిరిగి వరి నాట్లు వేసి అధికారులకు భూ కబ్జాదారులు సవాల్ విసిరారు. హత్నూర నుంచి బ్రాహ్మణగూడ వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న శిఖం భూమి కావడంతో అందరి దృష్టి క్రీడా ప్రాంగణంలో వరి నాట్లు ఏందంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. కబ్జా చేసిన వారిపై కేసు నమోదుతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుని శిఖం భూమిని కాపాడాలని రెండు గ్రామాల రైతులు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.
బ్రాహ్మణగూడ తెలంగాణ
క్రీడా ప్రాంగణంలోనే ఆక్రమణ
తాలిం చెరువులో
ఐదెకరాల వరకు వరి సాగు
క్రిమినల్ కేసులు పెడతాం
శిఖం భూమి గతంలో కూడా కబ్జాకు గురైతే కేసులు నమోదు చేశాం. ప్రస్తుతం కూడా శిఖం భూమిలో బ్రాహ్మణగూడ క్రీడా ప్రాంగణాన బోడు ఉన్న ప్రాంతంలో కొందరు భూమిని కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– పర్వీన్ షేక్, తహసీల్దార్

శిఖం భూమి కబ్జా