
కుటుంబ ఓటర్లకు ఒకే చోట ఓటింగ్
సంగారెడ్డి జోన్/జోగిపేట(అందోల్): పటాన్‌చెరు నియోజకవర్గంలో ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నజరీ నక్షలను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన ఈఆర్‌ఓ, సహాయ రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులతో, అందోలు–జోగిపేటలో ఆర్‌డీవో కార్యాలయంలో జిల్లా సర్వేఅండ్ ల్యాండ్ రికార్డ్ అధికారి ఐనేశ్‌తో కలిసి బుధవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...పోలింగ్ స్టేషన్లు ఆయా వార్డుల పరిధి లోపలే ఉండాలన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని మొత్తం 422 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తాము నివసించే ప్రాంతానికి సమీపంలోనే ఓటు వేసేలా మ్యాప్‌లు రూపొందించాలని సూచించారు. నియోజకవర్గస్థాయి నజరీ నక్షను నాలుగు రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు. భూసంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. వట్‌పల్లి మండలం రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా షాహెద్‌నగర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో భూములపై ఉన్న సందిగ్ధతకు ఈ రీసర్వే ప్రాజెక్టు తుది నివేదికలా నిలవాలని ఆమె సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఇసుక బజార్లు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఇసుక విషయంలో ఇబ్బందులు కలగకుండా జిల్లాలో ఇసుక బజార్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందోలు శివారులో ఏర్పాటు చేసిన సాండ్ బజార్‌ను ఆమె పరిశీలించారు. ఇళ్లకు తగిన మోతాదులో ఇసుకను అందించడంపై దృష్టి సారించాలన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ మాధురి, పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల సహాయ రిటర్నింగ్ అధికారులు, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య