
మట్టి మాఫియా!
రూటు మార్చిన
ఆ చెరువుల్లోంచే
నల్లమట్టి అక్రమ రవాణా
మట్టిమాఫియా కేంద్రంగా రాళ్లకత్వ
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ శివారులోని 286 సర్వే నంబర్లలో అక్రమార్కులు నాలుగు గ్రూపులుగా ఏర్పడి మట్టి మాఫియా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. శివానగర్ ఎల్‌ఈడీ పార్క్ తదితర పరిశ్రమలకు మట్టి రవాణా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. అర్ధరాత్రి సాగుతున్న మట్టి రవాణా వ్యవహారాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా భయాందోళనకు గురి చేయడమే కాకుండా దర్జాగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మట్టి మాఫియాతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ వ్యాపారం సాగుతుందని చెబుతున్నారు.
సాక్షిప్రతినిధి, సంగారెడి : మట్టి మాఫియా రూటు మార్చింది.. అక్రమ దందాను మూడు ప్రొక్లయినర్లు..ఆరు టిప్పర్లుగా కొనసాగించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ముంబై జాతీయ రహదారి (ఎన్‌హెచ్.65) పై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రహదారిపై డిజైన్ లోపాన్ని సరిచేయడం కోసం సదాశివపేట మండలం నందికంది వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని నేషనల్ హైవే అథారిటీ నిర్ణయించింది. ఈ ఫ్లైఓవర్ కోసం అవసరమైన మట్టి కోసం నందికంది చెరువులోంచి 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకెళ్లేందుకు నీటిపారుదలశాఖ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. అయితే ఇదే చెరువు నుంచి వేరే వాళ్లు అక్రమంగా మట్టిని తవ్వుతున్నారు. ఈ మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వందలాది టిప్పర్లలో ఈ సహజ సంపదను కొల్లగొడుతున్నారు. తమకున్న రాజకీయ పలుకుబడిని ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున అక్రమ దందాకు తెరలేపారు. ఎవరైనా చూస్తే జాతీయ రహదారి కోసం మట్టిని తవ్వుతున్నారనుకుంటారు. వాస్తవానికి నేషనల్ హైవే పనుల కంటే ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిపోతున్న మట్టే ఎక్కువగా ఉంటోంది. కొండాపూర్ మండలంలో కూడా పలు చెరువుల నుంచి ఇదే తరహాలో సహజ సంపద దోపిడీకి గురవుతోంది.
గుట్టుచప్పుడు కాకుండా..
ఇటుకబట్టీలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం చెరువుల్లో మట్టిని తవ్వుకునేందుకు అనుమతులు అంత ఈజీగా రావు. దీంతో ఇలా ముంబై జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన మట్టిని తవ్వుతున్న చెరువుల నుంచే మట్టిని కొల్లగొడుతున్నారు. ఈ అక్రమార్కులకు రాజకీయ అండదండలుండటంతో అధికారులు చూసీచూడనట్లు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
రాత్రి పగలు తేడా లేకుండా..
ఈ మట్టి అక్రమ రవాణా రాత్రి, పగలు అనే తేడా లేకుండా సాగుతోంది. భారీ ప్రొక్లయినర్లు ఈ చెరువులోంచి నల్లమట్టిని తవ్వి జిన్నారం మండలంలో పలుచోట్ల ఉన్న ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు, భారీ వాహనాల్లో ఈ నల్లమట్టి తరలిపోతుండటం గమనార్హం. ఈ చెరువులో ఒక్కోరోజు అర్ధరాత్రి వరకు కూడా తవ్వకాలు జరుగుతున్నప్పటికీ..ఇటు పోలీసులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అనుమతులు ఇచ్చిన నీటిపారుదలశాఖ కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు దారితీస్తోంది. నల్లమట్టి టిప్పర్లు నందికంది నుంచి పొత్తిరెడ్డిపల్లి చౌరస్తా.. కంది..ముత్తంగి మీదుగా జిన్నారం మండలంలోని ఇటుకబట్టీలకు రవాణా అవుతోంది. ఈ దందాలో పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ దందా చేస్తున్న వారికి రాజకీయ అండదండలుండటంతో ఇటు పోలీసులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నందికంది చెరువు నుంచి నల్లమట్టి అక్రమ రవాణాపై స్థానికులు పలుమార్లు నీటిపారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. కానీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.
ఫిర్యాదులు వచ్చాయి కానీ:
నందికంది చెరువు నుంచి మట్టిని తవ్వుకునేందుకు నేషనల్ హైవే పనుల కోసం అనుమతి ఇచ్చాము. ఈ చెరువులో వేరే వాళ్లు కూడా నల్లమట్టిని తవ్వుతున్నారనే ఫిర్యాదులు మాకు వచ్చాయి. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపి పరిశీలించాము. కానీ, అక్కడ అలాంటి తవ్వకాలు జరిగినట్లు మా దృష్టికి రాలేదు. ఇకపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం.
– మహేశ్, నీటిపారుదలశాఖ ఏఈ,
సదాశివపేట
యథేచ్ఛగా ఇటుక బట్టీలకు తరలింపు
నందికంది చెరువునుకొల్లగొడుతున్న అక్రమార్కులు
మట్టి టిప్పర్లు సీజ్
కొండాపూర్ (సంగారెడ్డి): అక్రమంగా చెరువు మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్‌లను శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేసి కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... నాలుగు రోజులుగా మండల కేంద్రంలోని చెరువులో మట్టిని గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్కులు రాత్రి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తూతూ మంత్రంగా రైతు పేరు మీద ఇరిగేషన్ విభాగంలో అనుమతులు తీసుకున్నారు. గ్రామంలో మట్టిని వేరే గ్రామానికి తరలించడం ఏంటని నిలదీసి టిప్పర్‌లను అడ్డుకొని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన తహసీల్దార్ టిప్పర్‌లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.

మట్టి మాఫియా!

మట్టి మాఫియా!