
నిండుకున్న అడుగుమందు
● సహకార సంఘాల్లో అందుబాటులోలేని డీఏపీ ● అడిగినా పంపని మార్క్‌ఫెడ్ ● ఈ సంస్థ వద్ద కూడా అడుగంటినబఫర్‌స్టాక్ ● ఇబ్బందులు పడుతున్న రైతులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో ఎరువుల కొరత షురూవైంది. ప్రధానంగా డీఏపీ ఎరువు పూర్తిస్థాయిలో దొరకడం లేదు. రైతుల అవసరాల మేరకు ఈ ఎరువు అందుబాటులో లేదు. పలు మండలాల్లోని సహకార సంఘాల్లో డీఏపీ నిల్వలు అయిపోయాయి. తమకు ఈ ఎరువులు పంపాలని ఆయా సహకార సంఘాలు అడుగుతున్నా...ఈ ఎరువులు అందుబాటులో లేకపోవడంతో నిల్వలు పంపలేకపోతున్నారు. పంటలకు అడుగుమందుగా పేరున్న ఈ ఎరువు ఇప్పుడు పత్తి, సోయా, చెరుకు వంటి పంటలు సాగుకు ఎంతో అవసరం ఉంటుంది. రైతుల అవసరాల మేరకు సహకార సంఘాల్లో ఈ స్టాక్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సంగారెడ్డి, మునిపల్లి, జహీరాబాద్ మండలాల్లో పలు సహకార సంఘాల్లో ఈ డీఏపీ ఎరువు కొరత ఏర్పడింది.
18 వేల మెట్రిక్ టన్నులు అవసరం
ఈ వానాకాలం సీజన్‌లో 7.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ సీజన్‌కు సుమారు 18 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరమని ఈ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు అవసరమైన ప్రతిపాదనను పంపింది. కానీ, ఇప్పటివరకు సుమారు తొమ్మిది టన్నులు మాత్రమే వచ్చింది. ఇప్పటికే ఈ ఎరువు విక్రయం అయింది. అయితే చాలామంది రైతులు ముందు జాగ్రత్తగా ఈ డీఏపీ ఎరువులను కొనుగోలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ఎరువుల నిల్వలు తగ్గాయని చెప్పుకొస్తున్నారు. గతేడాది వానాకాలం సీజన్ మొత్తానికి 16 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ విక్రయం జరిగిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
మార్క్‌ఫెడ్ వద్ద కూడా అడుగంటాయి..
జిల్లాలోని అన్ని సహకార సంఘాలకు, డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాలకు మార్క్‌ఫెడ్ ద్వారా ఎరువులు సరఫరా అవుతాయి. అయితే ఈ మార్క్‌ఫెడ్‌లోనే డీఏపీ లేదు. వాస్తవానికి మార్క్‌ఫెడ్ బఫర్ స్టాక్‌ను దగ్గర ఉంచుకోవాలి. ఎక్కడైనా ఎరువుల కొరత ఏర్పడితే.. ఈ బఫర్ స్టాక్ నుంచి ఎరువులను విడుదల చేయాలి. కానీ మార్క్‌ఫెడ్ వద్ద ప్రస్తుతం బఫర్ స్టాక్ దేవుడెరుగు..అసలు స్టాకే నిండుకుంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో సరఫరా చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు సుమారు 3 వేల మెట్రిక్ టన్నులు అవసమని అధికారులు తెలిపారు. కానీ, ఇప్పటి వరకు కేవలం సుమారు వెయ్యి టన్నులే వచ్చింది. 700 మెట్రిక్ టన్నులు బఫర్ స్టాక్ ఉండాలి. కానీ ఇప్పుడు 200 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఈ నిల్వలు ఏ మూలకు సరిపోవు. దీంతో ఈ ఎరువులు అడిగిన సహకార సంఘాలకు డీఏపీ పంపలేకపోతోంది.
ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో..
రైతులకు సేవలందించే సహకార సంఘాల్లో డీఏపీ ఎరువులు అందుబాటులో లేకపోగా, ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం ఈ నిల్వలున్నాయి. ప్రస్తుతం 2,400 టన్నులు డీలర్ల వద్ద డీఏపీ ఉందని వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతుండటం గమనార్హం. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు డీలర్లు ఈ ఎరువుల ఎక్కువ ధరలకు విక్రయించే అవకాశాలున్నాయి. దీనిపై వ్యవసాయశాఖ అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ అరకొర నిల్వలను డీలర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతోంది.
స్టాక్ రావడం లేదు
డీఏపీ ఎరువుల స్టాక్ రావడం లేదు. ప్రస్తుతానికి 200 టన్నుల డీఏపీ ఉంది. ఎమర్జెన్సీ అవసరాల కోసమని ఈ నిల్వలను ఉంచాము. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆదేశాల మేరకే ఈ నిల్వలను సహకార సంఘాలకు పంపుతున్నాం. గతేడాది ఈ ఎరువుల స్టాక్ బాగానే ఉంది. కానీ, ఈసారి అనుకుంత రాకపోవడంతో నిల్వలు తగ్గాయి.
– శ్రీదేవి, మార్క్‌ఫెడ్, డీఎం