ఆడుకుంటూ ఇనుప చువ్వలకు తగిలి
విద్యుదాఘాతంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి
హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో బా లుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని లింగ్సాన్‌పల్లి తండాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన చిలికి, మోహన్ పెద్ద కుమారుడు రీతు(10) నాల్గో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఆడుతూ స్లాబ్ పైకి ఎక్కి ఇనుప చువ్వలకు తగిలాడు. అప్పటికే వైరు తేలి ఉండటంతో కరెంటు షాక్ కొట్టి పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ సత్యనారాయణను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
వాటర్ హీటర్ షాక్‌తో..
పాపన్నపేట(మెదక్): వాటర్ హీటర్ షాక్ కొట్టి మహిళ మృతి చెందిన ఘటన పాపన్నపేటలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బెస్త భాగ్య, భూపతి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఉదయం చేపలు పట్టడానికి భూపతి వెళ్లగా, పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఇంటిలో ఒంటరిగా ఉన్న భాగ్య (36) స్నానం చేయడానికి బకెట్ నీటిలో వాటర్ హీటర్ పెట్టింది. కరెంట్ ఆఫ్ చేయకుండా నీరు వేడి అయ్యాయా లేదా అని బకెట్‌లో చేయి పెట్టి చూడగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
వడదెబ్బతో అడ్డా కూలీ
తూప్రాన్ : వడదెబ్బతో అడ్డా కూలీ మృతి చెందిన ఘటన పట్టణ కేంద్రంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. మాసాయిపేట మండలం పోతాన్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం బాలయ్య(44) అడ్డా కూలీగా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగా తూప్రాన్‌లో అడ్డా మీదికి శనివారం ఉదయం ఇంటి నుంచి వచ్చాడు. రాత్రి మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా రోడ్డు పక్కన పడి ఉన్నాడు. పెట్రోలింగ్ కోసం వచ్చిన పోలీసులు గుర్తించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న భార్య లక్ష్మీ, కుమారులు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. వడదెబ్బ కారణంగా మృతి చెందాడని వైద్యులు తెలుపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆడుకుంటూ ఇనుప చువ్వలకు తగిలి
ఆడుకుంటూ ఇనుప చువ్వలకు తగిలి


