దేవుడా... ఎన్నాళ్లీ వెతలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో
కేటగిరీల వారీగా దేవాలయాలు
గ్రేడ్ మెదక్ సంగారెడ్డి సిద్దిపేట
6(ఎ) 2 4 7
6(బి) 3 3 6
6(సి) 2 5 3
6(డి) 0 1 0
మొత్తం 7 13 16
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేవాలయాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఆయా దేవాలయాలకు రెగ్యులర్ ఈఓలు లేకపోవడంతో ఏళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫలితంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా ఇన్‌చార్జి లుగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులకు సైతం పలు రకాల ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నేళ్లుగా ఆలయాల్లో అధికారుల నియామకం చేపట్టడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 36ప్రముఖ దేవాలయాలున్నాయి. అదేవిధంగా ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గుర్తింపు పొందినవి 939 దేవాలయాలున్నాయి. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి నాలుగు కేటగిరీల వారీగా విభజించారు. 6(ఏ) కేటగిరీలో 13, 6(బి) కేటగిరీలో 12, 6(సి) కేటగిరీలో 10, 6(డి) కేటగిరీలో 1 చొప్పున ఆలయాలున్నాయి.
సంగారెడ్డి జోన్:
సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయం, రుద్రారం గణేశ్‌గడ్డ, బొంతపల్లి శ్రీ భద్రకాళి సహిత వీరభద్రేశ్వర ఆలయం, మెదక్‌లోని ఏడుపాయల శ్రీ దుర్గ భవాని ఆలయం, సిద్దిపేటలోని శ్రీ కోటిలింగాల ఆలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయంతో తదితర ఆలయాలున్నాయి.
ఒక్కో అధికారికి
పదికి పైగా బాధ్యతలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 ఈఓ పోస్టులు మంజూరు ఉండగా కేవలం 6 పోస్టులు మాత్రమే భర్తీ ఉన్నాయి. ఒక్కో ఈఓ కు సుమారు 10 కి పైగా ఆలయాలకు అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆలయ అధికారులకు అదనపు బాధ్యతలు ఉండటంతో ఆలయ అభివృద్ధి జరగకపోవటంతోపాటు భక్తుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆలయాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాల్సి ఉన్న తమ పరిధిలో ఉన్న ఆలయాల సందర్శనకు మాత్రమే సమయం సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
దూరాభారం... నిర్వహణ భారం
అదనపు బాధ్యతలతో ఆలయ అధికారులకు బాధ్యతలు, నిర్వహణ భారంగా మారాయి. అధికారులకు కేటాయించిన ఆలయాలు కొన్ని కిలోమీటర్ల మేర దూరం ఉండటంతో అధికారులకు దూరాభారంతోపాటు సమయం వృథా అవుతోంది. ఆలయాలకు కోర్టు తగాదాలు ఉండటంతో అక్కడికి హాజరు అవుతుండటంతో ఆలయ అధికారులకు ఆలయ నిర్వహణ భారంగా మారింది.
నియామకం కానీ రెగ్యులర్ అధికారులు
ఆలయ అధికారులే కాకుండా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి సైతం ఆలయాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు ఏడుపాయల దుర్గ భవాని ఆలయ ఈ ఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుమారు పదేళ్ల నుంచి దేవాదాయ శాఖలో ఈఓ పోస్టులు భర్తీ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయారు. ఇటీవల గ్రూప్–2 ఫలితాలు విడుదల కావడంతో వాటి ద్వారా నియామకం చేపట్టే అవకాశాలున్నాయని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని పూర్తిస్థాయిలో భర్తీ చేసి భక్తుల సమస్యలతోపాటు ఆలయ అభివృద్ధి కృషి చేయాల్సిన అవసరం ఉంది.
భక్తులకు తప్పని ఇబ్బందులు...
ఆయా జిల్లాలోని ఆలయాలకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారు. అంతేకాకుండా ప్రతీ ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయాలకు వచ్చే భక్తులకు మౌలిక వసతులు, సౌకర్యాలు లేక పలు ఆలయాల్లో ఇబ్బందులు పడుతున్నారు.


