
భర్త వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
చిన్నశంకరంపేట(మెదక్): భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ మన్నన్ ఆదివారం విచారణ నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం ఆగ్రహరం గ్రామానికి వట్టెపు రాజయ్య కుమారుడు మహేశ్‌తో వెల్దుర్తి మండలం షేరిలాకు చెందిన సాయిలు కూతురు పూజ(20)కి ఫిబ్రవరి 2న వివాహం జరిగింది. పెళ్‌లైన మూడు నెలల్లోనే భర్త వేధింపులు తట్టుకోలేక పూజ శనివారం ఆత్మహత్యకు పాల్పడగా, మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నాయి. శనివారం రాత్రి నుంచి రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్, చిన్నశంకరంపేట ఎస్‌ఐ నారాయణగౌడ్‌తో పాటు నార్సింగి, నిజాంపేట, వెల్దుర్తి, మెదక్, చేగుంట పోలీస్‌లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు పూజ భర్త మహేశ్, మామ రాజయ్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం డీఎస్పీ, తహసీల్దార్ మన్నన్ ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబీకులకు న్యాయం చేస్తామని డీఎస్పీ తెలిపారు.
భారీ బందోబస్తు మధ్య పంచనామ
తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, తహసీల్దార్ మన్నన్ విచారణ