
5 నుంచి రెవెన్యూ సదస్సులు
● పైలెట్ ప్రాజెక్టుగా ఒక మండలం ● రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశం
సంగారెడ్డి జోన్: ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పారు. భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జూన్ 2 వరకు పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్‌ఓ పద్మజారాణి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, హౌసింగ్ పీడీ చలపతిరావు పాల్గొన్నారు.
ప్రణాళిక బద్ధంగా ఓటరు జాబితా
తప్పులు లేని ఓటరు జాబితా ప్రణాళిక బద్ధంగా రూపొందించాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమీక్షలె ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ఫామ్7, చిరునామా మార్పు, పేరు సరిదిద్దేందుకు ఫామ్ 8 లను పరిశీలించి పూర్తి చేయాలన్నారు. ఒకే కుటుంబంలో ఉండే, ఒకే గేటెడ్ కమ్యూనిటీ లో ఉండే వారందరికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉండేలా ప్రణాళిక చేయాలని కోరారు.
నీట్ పరీక్ష కేంద్రాల పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాల్లో 3,320 అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. శుక్రవారం పట్టణంలోని పరీక్ష కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. రవాణా, తాగునీరు, పార్కింగ్, టాయిలెట్, వైద్య శిబిరాలు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి 1:30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇస్తారన్నారు. అభ్యర్థులకు పరీక్ష కేంద్రానికి చేరుకునే సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. ఒకవేళ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొన్నట్లయితే వెంటనే జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 56739కు సమాచారం అందించాలని కోరారు.
వడదెబ్బ నివారణపై అవగాహన
వడదెబ్బ నివారణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.