
● ఆలయాల్లో మార్మోగిన రామనామం ● తరలివచ్చిన భక్తజనం
గజ్వేల్‌రూరల్: శ్రీరామనవమి పురస్కరించుకొని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ప్రజ్ఞాపూర్‌లోని సీతారాములను పల్లకిపై ఊరేగింపుగా కోదండరామాలయం వరకు తీసుకురాగా వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదే విధంగా గజ్వేల్ పట్టణంలోని షిరిడీసాయి దేవాలయం, మురళీ కృష్ణాలయం, సత్యసాయి మందిరం, క్యాసారంలోని శివాలయంతో పాటు రిమ్మనగూడలోని గోలోకాశ్రమంలో శ్రీసీతారాము ల కల్యాణోత్సవ వేడుకలను ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవాల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ మల్లేశంతోపాటు కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు.