సబ్సిడీపై విత్తు ! | Sakshi
Sakshi News home page

సబ్సిడీపై విత్తు !

Published Thu, Apr 18 2024 10:30 AM

గత ఏడాది సాగయిన సోయాబీన్‌ పంట(ఫైల్‌) - Sakshi

● వానాకాలంలో ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ● ప్రణాళిక సిద్ధం చేస్తున్న వ్యవసాయశాఖ ● ఆనందంలో రైతాంగం ● ఐదేళ్ల క్రితం ఎత్తేసిన గత ప్రభుత్వం

జిల్లాలో సాగైన వానాకాలం

పంటలు (ఎకరాల్లో)..

పంట 2022 2023

సోయాబీన్‌ 56,470 81,560

మొక్కజొన్న 23,120 15,764

కంది 90,655 12,400

మినుము 16,526 6,275

పెసర 22,367 13,562

వరి 1,13,783 1,38,380

జహీరాబాద్‌: వానాకాలం సీజన్‌ నుంచి రైతాంగానికి సబ్సిడీపై విత్తనాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి ప్రతిపాదనలు సేకరించినట్లు తెలుస్తోంది. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు సబ్సిడీ ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది. వర్షాకాలంలో సాగు చేసే మొక్కజొన్న, కంది, వరి, పెసర, మినుము, జనుము, జీలుగ తదితర పంటల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల క్రితం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సోయాబీన్‌, పప్పు ధాన్యాలపై సబ్సిడీ ఎత్తి వేశారు. పచ్చిరొట్టెగా ఉపయోగపడే జనుము, జీలుగ విత్తనాలను మొక్కుబడిగా అందిస్తూ వస్తున్నారు.

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సబ్సిడీని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు రైతాంగానికి సబ్సిడీపై విత్తనాలను అందజేస్తోంది. పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం సోయాబీన్‌ విత్తనాలను అవసరం మేరకు ప్రతి ఏటా వర్షాకాలంలో అందజేస్తోంది. కేంద్రం నుంచి విత్తన సబ్సిడీ కింద నిధులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులకు సబ్సిడీపై విత్తనాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గతంలో ఇచ్చిన విధంగానే

గతంలో రైతులకు ఇచ్చిన విధంగానే సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 30 నుంచి 65 శాతం వరకు సబ్సిడీ అందించనున్నారు. సోయాబీన్‌కు 37 శాతం, జీలుగ, జనుము, పిల్లిపెసర్లకు 65 శాతం, కంది, పెసర, మినుము విత్తనాలకు 35 శాతం మేర సబ్సిడీ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా రైతులు పండించే పంటల వివరాలను పరిగణనలోకి తీసుకుని విత్తనాలను సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కర్ణాటక వైపు చూపు

ఐదేళ్లుగా రైతులకు సబ్సిడీపై సోయాబీన్‌ విత్తనాలు అందజేయడం లేదు. దీంతో రైతులు కర్ణాటక ప్రాంతానికి వెళ్లి కొనుగోలు చేసుకుంటున్నారు. తమ బంధువులు, స్నేహితుల ద్వారా సబ్సిడీ విత్తనాలను తెచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను అందిస్తే కర్ణాటకకు వెళ్లాల్సిన శ్రమ తప్పుతుందని రైతులు చెబుతున్నారు.

 
Advertisement
 
Advertisement