
సంగారెడ్డి : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలైతే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని.. లేదంటే కారు గుర్తు ఓటేసి గెలిపించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ కోరారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్తేనే హామీల అమలుకు కొట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ చాలాచోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి మద్దతు ఇస్తుందని ఆరోపించారు. ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్ బంద్ చేశారని, 24 గంటల కరెంటు నుంచి 12 గంటలకు తగ్గించారని పేర్కొన్నారు. తాగునీటి కష్టాలు పెరిగిపోయాయని చెప్పారు. రేవంత్ అబద్దాలతోనే పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనలో ఒక్క మంచి కార్యక్రమమైనా చేసిందా అని ప్రశ్నించారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్కటైనా తెలంగాణకు ఇచ్చారా అని నిలదీశారు. విదేశాల్లో నుంచి నల్ల ధనం తెచ్చి పంచుతామన్నారు.. 20 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాలు చెప్పారన్నారు. గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందన్నారు. మతాలతో బీజేపీ పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డిని తానే ఒప్పించి బరిలో ఉంచానని చెప్పారు. గాలి అనిల్‌కుమార్ ఉద్యమకారుడు అని.. వీళ్లిద్దరిఇని గెలిస్తే ప్రజలకు సేవ చేస్తారని పేర్కొన్నారు.