కలెక్టర్ శరత్, ఎస్పీ రూపేశ్
సంగారెడ్డి టౌన్: బుల్లెట్ కన్నా బ్యాలెట్ ఎంతో గొప్పదని, అర్హులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం వహించాలని జిల్లా ఎన్నికల అధికారి శరత్, ఎస్పీ సీహెచ్ రూపేశ్ పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా కలెక్టరేట్ నుంచి అంబేడ్కర్ స్టేడియం గ్రౌండ్స్ వరకు పెద్ద ఎత్తున ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఐటీఐ, ఐబీ, కొత్త బస్టాండ్ మీదుగా అంబేడ్కర్ స్టేడియం గ్రౌండ్స్ వరకు చేరుకొని ముగిసింది. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులందరినీ ఓటరుగా నమోదు చేశామని వివరించారు. ఈనెల 30 పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ తమ ఓటు వేసి నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఓటు వజ్రాయుధం లాంటిదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ అశోక్, జిల్లా అధికారులు, డీఆర్‌ఓ నగేశ్, ఉద్యోగులు, యువత, యువజన సంఘాల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థులు, ట్రాన్స్ జెండర్లు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు, కళాకారులు, ప్రత్యేక భద్రతా దళాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.