నాడు చంద్రబాబు అలా.. నేడు సీఎం జగన్‌ ఇలా.. 

Kommineni Srinivasa Rao Comments On Global Investors Summit 2023 - Sakshi

ఆ సన్నివేశం చూస్తేనే ఎంతో సంతోషం కలుగుతుంది. నిజంగా ఏపీలో ఇంత ప్రముఖంగా పారిశ్రామిక సదస్సు జరిగిందా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సమర్ద నాయకుడు పాలకుడుగా ఉంటే ఇంత గొప్పగా కార్యక్రమం జరుగుతుందన్నమాట అన్న నమ్మకం ఏర్పడుతుంది. ఇదంతా దేని గురించి చెబుతున్నది అర్ధం అయ్యే ఉంటుంది. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సమ్మిట్‌ గురించే..

ఈ సమ్మిట్‌లో సుమారు 14 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు పెట్టడానికి దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు ముందుకు రావడం బ్రహ్మాండమైన శుభ పరిణామం. 350 ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అన్నిటికంటే అందరిని ఆకర్షించిన అంశం ఏమిటంటే దేశంలోనే అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముకేష్ అంబాని స్వయంగా విశాఖకు తన మందీ మార్బలంతో వచ్చి పరిశ్రమ పెట్టడానికి ప్రతిపాదన ఇవ్వడం.

ఇది వినడానికి, చూడటానికి ఎంత ఆనందం కలుగుతుంది!. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్కనే అంబానీ మూడు గంటలకుపైగా కూర్చుని ఆయా అంశాలపై మాట్లాడుతుండటం ఒక విధంగా సంచలనమే అని చెప్పాలి. ప్రతీ నిమిషాన్ని లెక్క వేసుకునే స్థాయిలో ఉన్న అంబానీ.. ఏపీ కోసం అంత టైమ్ కేటాయించడం, మొదటిసారిగా దక్షిణాదిలో ఒక పారిశ్రామిక సదస్సులో పాల్గొనడం ఇవన్నీ రాష్ట్రానికి శుభ సంకేతాలుగా కనిపిస్తాయి. సీఎం వైఎస్‌ జగన్‌ సత్తా ఏమిటో ఈ గ్లోబల్ సదస్సు రుజువు చేసింది. 

ఒక్క అంబానీనే కాదు.. అదానీ, జిందాల్, హెటిరో, అరబిందో, భారత్ బయోటెక్.. ఇలా ఒకటేమిటి దేశంలోని అన్ని ప్రముఖ సంస్థలు తరలి వచ్చి ఏపీ ప్రభుత్వానికి అండగా నిలబడ్డాయి. తమ పరిశ్రమలు పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రజలలో ఒక విశ్వాసం, నమ్మకం కలిగించడానికి వారు సిద్దం అవడం ఒకరకంగా గేమ్ చేంజర్ అని అంతా భావిస్తున్నారు. ఏపీలో కొన్ని శక్తులు, టీడీపీ వంటి రాజకీయ పక్షం, టీడీపీ మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ఈ సదస్సును విఫలం చేయాలని ప్రయత్నించినా, పారిశ్రామికవేత్తలను భయపెట్టేలా టీడీపీ ఆరోపణలతో రాష్ట్రానికి ద్రోహం చేస్తే, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా శక్తివంచన లేకుండా పచ్చి అబద్దపు కథనాలను వండి వార్చినా సీఎం జగన్ వ్యూహం ముందు నిలబడలేకపోయారు. 

వీరు చేసిన విష ప్రచారాన్ని దేశ, విదేశాలలోని పారిశ్రామిక ప్రముఖులు ఎవరూ విశ్వసించలేదు. అందుకే వారంతా విశాఖకు తరలివచ్చి సమ్మిట్‌ను గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ మొత్తం సదస్సు ఏపీ ఏయే రంగాలలో బలంగా ఉందో తెలియచేసింది. కేవలం ఐటీ రంగం వస్తేనే పరిశ్రమలు వచ్చినట్లుగా భావించే దశ నుంచి మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ మొదలైన రంగాలలో ఏపీ తన పట్టును నిరూపించుకోగలిగిందని వెల్లడైంది. అదే సమయంలో ఐటీకి సంబంధించి కూడా నలభై వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి. 

విశాఖలో గ్రీన్ టెక్ నిర్మాణం, విజయవాడ కృష్ణా నదిలో టూరిజం ప్రాజెక్టు. సుమారు తొమ్మిది లక్షల కోట్ల మేర గ్రీన్ ఎనర్జీ, పంప్డ్‌ స్టోరేజ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ వంటి రెన్యూవబుల్ ఇంధన రంగంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం అంటే బహుశా దేశంలోనే ఒక రికార్డు అని చెప్పాలి. ఇంత విద్యుత్ ఉత్పత్తి జరిగితే ఏమి చేసుకుంటారని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కానీ, దేశం అంతా వస్తున్న ఎనర్జీ విప్లవంలో ఎవరు ముందుకు వెళితే వారు సాధించగలుగుతారు. రానున్న కాలంలో సాంకేతిక విప్లవంలో ఇంకెన్ని మార్పులు వస్తాయో ఊహించలేం. అంబానీ, అదానీ, తదితరులు ఈ రంగంలోకి వస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న ప్రాధాన్యత అర్ధం అవుతుంది. 

అలాగే టూరిజం, ఫార్మా, మినరల్ తదితర పోర్టు ఆధారిత పరిశ్రమలకు ఒప్పందాలు కుదిరాయి. కొందరు కావాలని సీఎం జగన్ దావోస్ ఒక్కసారే వెళ్లారని, ఈ నాలుగేళ్లలో ఒకేసారి సమ్మిట్ పెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు. దావోస్‌కు వెళ్లిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ సాధించిన విజయాలు చూశాం. అదే సమయంలో ప్రపంచమంతా రెండేళ్లు కోవిడ్ కుదిపేసిన సంగతిని దాచిపెట్టి కొందరు కువిమర్శలు చేస్తే పట్టించుకోనవసరం లేదు. దావోస్‌ను మించి విశాఖపట్నంలో పదిరెట్ల విజయాలను ఆయన సాధించారు. 2018లో టీడీపీ హయాంలో సుమారు నాలుగున్నర లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే, జగన్ ప్రభుత్వం ఒకే సదస్సులో 14 లక్షల కోట్ల పెట్టుబడులు సంపాదించింది. దీనిని బట్టే ఈ సదస్సు ఎంత విజయవంతమైంది అనేది తెలుస్తుంది. 

ఇవన్నీ ఆచరణలోకి వస్తాయా అన్న సంశయం రావచ్చు. ఆ మాటకు వస్తే చంద్రబాబు టైమ్‌లో అన్ని సదస్సులు కలిపి ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పేవారు. కానీ, ఆచరణలో కేవలం ఏడు శాతం మాత్రమే అమలు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రచార యావలో పడి ఎవరితో పడితే వారితో ఎంవోయూలు చేసుకున్నారు. దారినపోయే వారితో కూడా ఒప్పందం అయ్యారన్న విమర్శలు వచ్చాయి. సీఎం జగన్ మాత్రం అలా చేయలేదు. ఉన్నంతలో అమలుకు అవకాశం ఉన్న ఎంవోయూలే చేసుకున్నారు. అందువల్లే ఒప్పందాలు సంఖ్య 350గానే ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందాలు చేసుకున్న కంపెనీలలో తొంభై శాతం దిగ్గజ కంపెనీలు, లేదా పది మందికి తెలిసిన కంపెనీలే అన్న విషయం బోధపడుతుంది. 

ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు అమలు అయిపోతాయని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటేనే ఆరు నెలల నుంచి ఏడాదిపైగానే పడుతుంది. అలాంటిది ఒక భారీ పరిశ్రమ పెట్టడానికి ఎన్నో సమకూర్చుకోవాలి. అందుకు మూడు, నాలుగేళ్లపాటు పట్టవచ్చు. అది పెట్టుబడిని బట్టి ,సామర్ధ్యం బట్టి ఉంటుంది. మౌలిక సదుపాయాలు, యంత్ర పరికరాలు, మార్కెటింగ్, బ్యాంక్ రుణం తదితర అవసరాలను పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. వీటిలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా అవి అవాంతరాలుగా మారతాయి. 

ఇదే సమయంలో ప్రభుత్వపరంగా సహకారం విషయంలో ఎక్కడా జాప్యం ఉండకూడదు. అనుమతులను నిర్దిష్ట సమయంలోనే మంజూరు చేయవలసి ఉంటుంది. ఈ విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటికే ముందంజ వేసిందని చెప్పాలి. ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థ సీఈవో ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రభుత్వం సహకారం వల్ల ఏడాది ముందుగానే తమ షెడ్యూల్ పూర్తి అవుతోందని, దీని వల్ల తమకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇక్కడే ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయినట్లు భావించవచ్చు. 

ఆయన తరచుగా పరిశ్రమలకు ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ కాల్ చేయండని చాలా స్పష్టంగా చెబుతున్నారు. సీఎం జగన్ సమర్ధతను, పరిశ్రమలపై ఉన్న చిత్తశుద్దిని అనేక మంది పారిశ్రామికవేత్తలు తమ ఉపన్యాసాలలో స్పష్టంగా చెప్పారు. ఇందులో రిలయన్స్ అధినేత అంబానీ ఒకరు. ఆయన ఏపీలో తమ ప్రజెన్స్ వివరిస్తూ, కొత్తగా పది గిగావాట్ల సామర్ద్యంతో సోలార్ ఎనర్జీ పరిశ్రమ స్థాపిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమను, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ దార్శనికతను కొనియాడారు. ఏపీకి అపార వనరులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో లక్షాఇరవై కోట్ల రూపాయల వ్యయం చేస్తోందని, ఇది మంచి విషయమని సైంట్ సంస్థ వ్యవస్థాపకులు మోహన్ రెడ్డి మెచ్చుకున్నారు. 

గతంలో చంద్రబాబు పార్టనర్‌షిప్‌ సదస్సు పేరుతో నిర్వహించిన సమావేశాల్లో అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ తరచూ ఆయనే ప్రసంగాలు చేస్తుండేవారు. కానీ, సీఎం జగన్ అలాకాకుండా నిర్దిష్ట టైమ్‌లో అవసరమైనమేర క్లుప్తంగానే చెప్పదలచుకున్న విషయాలను సూటిగా చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చి మాట్లాడించారు. ఏపీని షోకేస్ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయబోతున్న అంశాన్ని మరోసారి ఉద్ఘాటించారు. ఇక పరిశ్రమల ప్రతిపాదనలు అమలు కావడానికిగాను ఛీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతివారం సమీక్షించాలని ఆదేశించారు. 

ఈ రకంగా కేవలం సమ్మిట్‌కే పరిమితం కాకుండా ఫాలో అప్ యాక్షన్‌కు కూడా సిద్దం అవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సాధించిన ఈ విజయాన్ని చూసి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతోంది. ఏవో పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రకటనలు చేసింది. తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడానికి యత్నించింది. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టీవీ-5 వంటివి కూడా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని భయపెట్టేరీతిలో కథనాలు ఇచ్చాయి. అయితే, ఈనాడు.. సదస్సు జరిగినంతవరకు కవరేజీ మాత్రం పద్దతిగానే ఇచ్చిందని చెప్పాలి. మిగిలిన టీడీపీ మీడియా మాత్రం తమ ధోరణి మార్చుకోలేదు. 

పదమూడేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా, పద్నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. చంద్రబాబు విశాఖలో అంబానీని చూడగానే అప్ సెట్ అయి ఉంటారు. తన హయాంలో రాని దిగ్గజం, సీఎం జగన్ నిర్వహించిన సమ్మిట్‌కు వస్తారా అని కడుపు మంటకు గురై ఉండవచ్చు. అందుకే తన పార్టీ నేతలతో చెత్త విమర్శలు చేయించారని అనుకోవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సదస్సు జరిగిన రెండు రోజులు మాట్లాడబోనని చెప్పడం మంచిదే.

కేంద్రం నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు పార్టీలతో నిమిత్తం లేకుండా ఏపీకి పలు ప్రయోజనాలు చేకూర్చే రీతిలో ప్రసంగాలు చేయడం హర్షణీయం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన సహజ శైలిలో ఏపీకి మౌలిక సదుపాయాల కల్పనలో ఏ విధంగా కేంద్రం నిధులు మంజూరు చేసేది తెలిపారు. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సోనోవాల్ వచ్చి పారిశ్రామిక సదస్సుకు వన్నె తెచ్చారు. విశాఖపట్నం అభివృద్దికి వీరిద్దరూ కలిసి 13 వేల కోట్ల రూపాయలు వ్యయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఏపీలో పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, కొత్తవి రావడంలేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నవారికి విశాఖ సదస్సు గట్టి జవాబే ఇచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్ ఆశించినట్లు ఈ పెట్టుబడుల ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే ఏపీ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంటుందన్నది నిజం. ఆ క్రమంలో ఇది ఒక ముందడుగు.
- కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు, సీ.ఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్. 
 

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top