హరిత హైడ్రోజన్‌.. కాలుష్యానికి సొల్యూషన్‌ | 30000 Deaths Attributed Each Year to Air Pollution in 10 Indian Cities | Sakshi
Sakshi News home page

హరిత హైడ్రోజన్‌.. కాలుష్యానికి సొల్యూషన్‌

May 19 2025 3:30 AM | Updated on May 19 2025 3:30 AM

30000 Deaths Attributed Each Year to Air Pollution in 10 Indian Cities

కాలుష్యంతో దేశంలోని 10 నగరాల్లో ఏటా 30,000 మరణాలు

గ్రీన్‌ హైడ్రోజనే దీనికి పరిష్కారం

విద్యుత్తుకు మంచి ప్రత్యామ్నాయం

గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు ఎక్కువే

భవిష్యత్తులో తగ్గే అవకాశం

వేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా 2050 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు నగరాల్లో నివసిస్తారని అంచనా. పట్టణాలు వృద్ధి చెందడం ట్రాఫిక్‌ రద్దీ, వాయు కాలుష్యం వంటి సవాళ్లూ వస్తాయి. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం విద్యుత్‌ వాహనాల వినియోగం కనిపిస్తోంది. భవిష్యత్తులో హైడ్రోజన్‌ ఇంధనం తోడవ్వనుంది. ఇది కాలుష్యాన్ని మరింత తగ్గించి, స్వచ్ఛ భారత్‌ సాధనకు కారకమవుతుందని ఇంధన, వాహన రంగ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో నడిచే వాహనాల్లో 16 శాతం హైడ్రోజన్‌తోనే ఉంటాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా వేస్తోంది.

ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల టాప్‌–5 దేశా­ల్లో ఇండియా ఉంది. మన దేశంలో 2008 నుంచి 2019 వరకూ, గాలిలో ఉండే పీఎం 2.5 కణాలు 10 ప్రధాన నగరాల్లో ఏటా దాదాపు 30 వేల మరణాలకు కారణమయ్యాయి. ఇది మొత్తం మరణాలలో 7.2 శాతమని లాన్సెట్‌ అధ్యయనం వెల్లడించింది. ఇందులో ఏటా ముంబైలో మరణించినవారు 5,100, కోల్‌కతాలో 4,678,  చెన్నైలో 2,870 మంది. తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పుణే, వారణాసి, సిమ్లా, ఢిల్లీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్‌ వాహనాల (ఈవీ)కు డిమాండ్‌ పెరిగింది.

దూసుకొస్తున్న హైడ్రోజన్‌
2023 నాటికి, ప్రపంచ రోడ్లపై 4 కోట్ల ఈవీలు ఉన్నాయి. ఇది 2022లో సంఖ్య కంటే 35 శాతం ఎక్కువ. మనదేశంలో 2024లో ఏకంగా 20.22 లక్షల ఈవీల అమ్మకాలు జ­రి­గాయి. ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా వస్తున్నవే ఫ్యూయల్‌ సెల్‌ ఎలక్ట్రిక్‌ వాహ­నాలు (ఎఫ్‌సీఈవీ). ఇవి హైడ్రోజన్‌ సాయంతో నడుస్తాయి. ఐఈఏ గణాంకాల ప్రకా­రం 2023 నాటికి ప్రపంచంలో హైడ్రోజన్‌ డిమాండ్‌ 9.7 కోట్ల టన్నులకు చేరింది. 2022తో పోలిస్తే ఇది 2.5 శాతం ఎక్కువ. నీటిని విద్యుత్‌ విశ్లేషణ (ఎలక్ట్రాలసిస్‌) ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టవచ్చు.

సౌరశక్తి వంటి పునరుత్పాదక వనరులతో ఉత్పన్నమయ్యే విద్యుచ్ఛక్తితో నీటిని విభజిస్తే గ్రీన్‌ హైడ్రోజన్‌ వస్తుంది. అలా కాకుండా బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి వాటితో ఉత్పన్నమయ్యే విద్యుత్తుతో నీటిని విభజిస్తే బ్లూ, గ్రే హైడ్రోజన్‌లు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రక్రియలోనూ కర్బన ఉద్గారాలు వెలువడతాయి. గ్రీన్‌ హైడ్రోజన్‌ అలా కాదు, స్వచ్ఛమైన ఇంధనం. ము­ఖ్యం­గా ఎరువులు, చమురు శుద్ధి, ఉక్కు, రవాణా వంటి రంగాల్లో అత్యధిక కర్బన ఉద్గా­రాలు వెలువడతాయి. ఈ రంగాల్లో గ్రీన్‌ హైడ్రోజన్‌ వాడితే ఆ మేరకు అవి తగ్గుతాయి.

అధిక ధర, నిర్వహణ ఖర్చులు
హైడ్రోజన్‌ వాహనాలు తేలిగ్గా ఉంటాయి. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలవు.  కేవలం 5 నుంచి 15 నిమిషాల్లో ఇంధనం నింపుకోగలవు.  ముఖ్యంగా దూర ప్రయాణం, వర్షం, తీవ్రమైన చలిలోనూ దూసుకుపోగలవు. అయితే, ప్రస్తుతం ఈ వాహనాలు చాలా తక్కువగా.. ప్రపంచవ్యాప్తంగా 93 వేలే ఉన్నాయి. దీనికి కార­ణం వాటి అధిక ధర, నిర్వహణ ఖర్చులు.  డీజిల్‌ బస్సులకు కిలోమీటర్‌కు నిర్వహణ ఖర్చు దాదాపు రూ.23.06 అవుతుంది.

 ఎలక్ట్రిక్‌ బస్సులకు రూ.14.52 ఖర్చవుతుంది. విద్యుత్‌ వాహనాల కొనుగోలు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ మేరకు నిర్వహణ భారం తగ్గుతుంది. కానీ హైడ్రోజన్‌ బస్సులు నడపడానికి చాలా ఖర్చవుతుంది. సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసిన బ్లూ హైడ్రోజన్‌ వాహనానికి కిలోమీటర్‌కి రూ.71.73 ఖర్చవుతుంది. గ్రీన్‌ హైడ్రోజన్‌ అయితే కిలోమీటర్‌కు రూ.77.69 ఖర్చవుతుంది. సాంకేతికత మెరుగుపడటంతో రెండింటి ధరలు 2030 నాటికి సమానమవుతాయని నిపుణులు భావిస్తున్నారు.

స్టీల్, వాహన రంగాల్లో..
స్టీల్‌ ఉత్పత్తిని గ్రీన్‌ హైడ్రోజన్‌తో చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం 7 పైలట్‌ ప్రాజెక్టులు మంజూరు చేశారు. 2029–30 వరకు గ్రీన్‌ హైడ్రోజన్‌ ద్వారా స్టీల్‌ ఉత్పత్తి చేసేందుకు రూ.455 కోట్లతో పైలట్‌ ప్రాజెక్టులను కేంద్ర స్టీల్‌ శాఖ అమలుచేస్తోంది. రవాణా రంగంలో 5 పైలట్‌ ప్రాజెక్టులు మంజూరు చేశారు.

గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌
గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి, వాడకం, ఎగుమతుల్లో మనదేశాన్ని గ్లోబల్‌ హబ్‌గా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ (జీహెచ్‌ఎమ్‌) అమలు చేస్తోంది. దీని ప్రకారం ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయగలిగితే శిలాజ ఇంధనాల దిగుమతులను భారీగా తగ్గించుకోవచ్చు. ఫలితంగా 2030 నాటికి 
రూ.లక్ష కోట్లు ఆదా చేయొచ్చు. గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి, వినియోగం వల్ల  ఏటా 5 కోట్ల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ ఉద్గారాలనూ తగ్గించుకోవచ్చు. గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేసే కంపెనీలకు కేంద్రం ప్రోత్సాహకాలూ ఇస్తోంది.

వైఎస్‌ జగన్‌ హయాంలో...
ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి రాక్‌మ్యాన్‌ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ ఏర్పాటుచేసిన మొట్టమొదటి గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు ఈ ఏడాది మార్చిలోనే ఉత్పత్తి ప్రారంభించింది. విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో భాగంగా అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ ఏపీలో హరిత ఇంధన రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా  తొలి విడతలో 25 టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేస్తారు. రానున్న కాలంలో 54 టన్నులకు పెంచనున్నారు. దీని ద్వారా ఏడాదికి 206 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ ఉద్గారాల తగ్గింపుతోపాటు వాతావరణంలోకి ఏడాదికి సుమారు 195 టన్నుల ఆక్సిజన్‌ విడుదల అవుతుంది. 

విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లోనే.. ప్రభుత్వ రంగ విద్యుత్‌ సంస్థ ఎన్‌టీపీసీతో ఏపీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. సుమారు రూ.లక్ష కోట్లతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులు 2026 నాటికి, మొత్తం 2030 నాటికి పూర్తవుతాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలోనే హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ వంటి సంస్థలు కూడా గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి.

గ్రీన్‌ హైడ్రోజన్‌ రైలు
పూర్తి దేశీయ పరిజ్ఞానంతో హైడ్రోజన్‌తో నడిచే రైలును రైల్వే శాఖ తయారుచేసింది.  మిగతా దేశాలు 500 నుంచి 600 హార్స్‌ పవర్‌ ఇంజిన్‌ మాత్రమే రూపొందిస్తే.. మనదేశం ఏకంగా 1,200 హెచ్‌పీ ఇంజిన్‌ తయారుచేయగలిగింది. ప్రపంచంలో జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా మాత్రమే ఇలాంటి ఇంజిన్లు తయారుచేశాయి. ప్రపంచంలో అత్యంత పొడవైన (10 కోచ్‌లు) రైలు ఇదే. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం (2,400 కిలోవాట్లు) ఉన్న రైలు కూడా ఇదే. హరియాణాలోని జింద్‌ – సోనిపట్‌ మధ్య ఈ రైలు నడవనుంది.

ఉత్పత్తి వ్యయం ఎక్కువే..: ఒక కేజీ బ్లూ లేదా గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి గరిష్ఠంగా 2.4 డాలర్ల వరకు ఖర్చవుతుంది. అదే కేజీ గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి దాదాపు 5.5 డాలర్లు వెచ్చించాలి. గ్రే హైడ్రోజన్‌ ఉత్పత్తితో పోలిస్తే గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి వల్ల.. ప్రతి కేజీకి 10 కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు తగ్గుతాయి.

గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌లో భాగంగా చేపట్టే ప్రాజెక్టుల ద్వారా రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు, 6 లక్షలకుపైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా.

తెలంగాణలోనూ..
తెలంగాణ కూడా 2029–30 నాటికి 418 కిలోటన్నులు, 2034–35 నాటికి 554 కిలోటన్నుల వార్షిక గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ – 2025లో వెల్లడించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలూ  ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement