యాచారం: ఫార్మాసిటీ భూముల్లో కబ్జాలో ఉన్న రైతులకు పరిహారం చెల్లింపు కలగానే మిగులుతోంది. మూడేళ్లుగా బాధిత రైతులు రెవెన్యూ, టీజీఐఐసీ శాఖల అధికారుల చుట్టు చెప్పులరిగేలా ప్రదిక్షణ చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీకి 7,500 ఎకరాల వరకు పట్టా, అసైన్డ్ భూములను సేకరించారు. భూసేకరణ మొదట్లో అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.8 లక్షలు, కబ్జాలో ఉన్న రైతులకు రూ.7.70 లక్షల పరిహారం అందజేశారు. ఆయా గ్రామాల్లో 200 మందికి పైగా రైతులు 300 ఎకరాలకు పైగా కబ్జాలో ఉన్నారు. పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు కబ్జాలోని రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.
నమ్మించి మోసం
ఆరు నెలల క్రితం ఫార్మాసిటీకి సేకరించిన భూముల చుట్టూ హద్దులు, ఫెన్సింగ్ వేసే పనులను పూర్తి చేశారు. ఆ సమయంలో కబ్జాలో ఉన్న రైతులు పనులను అడ్డుకోగా అప్పటి ఆర్డీఓ అనంత్‌రెడ్డి, ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం తహసీల్దార్ అయ్యప్ప, గ్రీన్ ఫార్మాసిటీ అప్పటి సీఐ లిక్కి కృష్ణంరాజు పరిహారం అందజేస్తామని రైతులకు నచ్చజెప్పారు. నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో దాదాపు 250 ఎకరాల్లో కబ్జాలోని రైతులకు పరిహారం అందజేయాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ నారాయణరెడ్డి కబ్జా రైతులకు పరిహారం చెల్లింపునకు హైలెవల్ కమిటీ వేసినట్లు ప్రచారం జరిగింది. కానీ నేటికి కార్యరూపం దాల్చలేదు. కబ్జాలోని రైతులు మాత్రం పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
కబ్జాలోని రైతులకు కొరవడిన స్పష్టత
మొండిగౌరెల్లిలో పారిశ్రామిక పార్క్‌ల కోసం అధికారులు తాజాగా భూసేకరణ చేపడుతున్నారు. భూసేకరణ చేపట్టే 19, 68, 127 సర్వే నంబర్లలో కబ్జాలో ఉన్న రైతులే ఎక్కువగా ఉన్నారు. అసైన్డ్ పట్టా భూములకు ఎకరాకు రూ.30 లక్షల పరిహారం అందజేస్తామని హామీలిచ్చారు. రైతు సమావేశాల్లో కబ్జా రైతులకు సైతం పరిహారం అందజేస్తామని ప్రకటిస్తున్నారే తప్ప స్పష్టత ఇవ్వడం లేదు. గ్రామంలోని రైతులు ఐక్యంగా లేకపోవడం కూడ అధికారులకు అవకాశంగా మారింది. కొందరు రైతులు భూములు తీసుకోవాలని.. మరి కొందరు పరిహారం చెల్లించిన తర్వాతే ఫెన్సింగ్ వేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేతల్లోనూ సమష్టి నిర్ణయాలు లేక కబ్జాలో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.
హద్దులు, ఫెన్సింగ్ వేసే సమయంలో పరిహారం ఇస్తామని ప్రకటన
నేడు మొహం చాటేస్తున్న అధికారులు
నాలుగు గ్రామాల్లో 200 మందికి పైగా కబ్జా రైతులు
పరిహారం కోసం పడిగాపులు


