ఏమిటీ కమీషన్ల దందా? | - | Sakshi
Sakshi News home page

ఏమిటీ కమీషన్ల దందా?

May 17 2026 11:23 AM | Updated on May 17 2026 11:23 AM

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ లోకల్‌ ఏరియా డెవెలప్‌మెంట్‌ స్కీం (ఎంపీ లాడ్స్‌) పనుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులో ఉమ్మడి జిల్లాలోని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రతి పనిలోనూ 12 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారు. రెండు జిల్లాల అధికారుల తీరుతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు’ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌ సముదాయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఎల్‌.శ్రీలత అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్య కార్యదర్శి, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు కిరణ్మయి, చంద్రారెడ్డి, సభ్యులు షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు. సమావేశంలో వ్యవసాయం, హార్టికల్చర్‌, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉపాధి కల్పన, పౌరసరఫరాలు, పంచాయతీ, రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ తదితర విభాగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, అమలు తీరు తెన్నులపై చర్చించారు.

మీ కెందుకు కమీషన్‌ ఇవ్వాలి?

సీపీఓ సౌమ్య ఎంపీ లాడ్స్‌ కేటాయింపు, నిధుల ఖర్చును వివరిస్తుండగా కమిటీ చైర్మన్‌, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పనుల కేటాయింపు, నిధుల ఖర్చుపై అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ లాడ్స్‌ నుంచి తాను ఇప్పటికే వందకుపైగా పనులు మంజూరు చేయగా 20కి మించి చేపట్టలేదని చెప్పారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు ప్రతి పనిలోనూ కమీషన్‌ ఆశిస్తున్నారని, వర్క్‌ ఎస్టిమేషన్‌, అగ్రిమెంట్‌, బిల్లుల చెల్లింపు వరకు 12 శాతం కమీషన్‌ చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇది కాంట్రాక్టర్లకు భారంగా మారుతోందని, చిన్నచిన్న పనులకు కమీషన్లు ఎందుకు చెల్లించాలని పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను నిలదీశారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని ఈ రెండు విభాగాలు అవినీతి, అక్రమ వసూళ్లకు నిలయంగా మారాయని ఆరోపించారు. అధికారులకు 12 శాతం కమీషన్‌, 18 శాతం జీఎస్టీ చెల్లించిన తర్వాత కాంట్రాక్టర్‌కు మిగిలేదేముందని ప్రశ్నించారు. అధికారులు తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి జోక్యం చేసుకుని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎంపీ లాడ్స్‌ పనులనూ వదలరా..

కాంట్రాక్టర్లు ముందుకు

రాకపోవడానికి అధికారుల తీరే కారణం

నిలదీసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

వాడీవేడిగా ‘దిశ’ సమీక్ష సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement