వరుసగా పుస్తెలతాళ్లు చోరీ చేసిన దుండగులు
షాబాద్: మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ చేసిన అంతర్రాష్ట దొంగలను షాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కటకటాల పాలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 7న నందిగామ మండలం బుగ్గోనిగూడ గ్రామానికి చెందిన భారతమ్మ మద్దూరు స్టేజీ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుంది. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు బైకుపై వచ్చి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఏసీపీ, డీసీపీ ఆదేశాలతో వారి బైకు మొబైల్ ఆధారంగా వాళ్లది ఉత్తర్‌ప్రదేశ్ అని గుర్తించారు. ప్రత్యేక బృందం వెంటనే ఉత్తరప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లి అక్కడే పట్టుకొని శనివారం ఉదయం షాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. వారి వద్ద నుంచి రూ.పది వేలు, మూడున్నర తులాల బంగారం రికవరీ చేశారు. ఇదే తరహాలో శంషాబాద్, మహేశ్వరం, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లు పరిధిలోనూ నాలుగు దొంగతనాలు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని శనివారం మధ్యాహ్నం సెలవుల కోర్టులో హాజరు పరిచిన్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం జరిగిన పది రోజుల్లోనే కేసును ఛేదించడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్‌ఐలు రమేష్, సతీష్‌కుమార్, శంకర్‌రెడ్డి, కానిస్టేబుళ్లను డీసీపీ యోగేష్‌గౌతమ్, చేవెళ్ల ఏసీపీ కిషన్ అభినందించారు.


