మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య
మీర్‌పేట: గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిన తండ్రి తిరిగి రాలేదన్న మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కేశంపేటకు చెందిన బుయ్యకారి చంద్రశేఖర్‌రావు (26) ప్రైవేటు ఉద్యోగి. గత నెల 24న తన తండ్రి రవీందర్‌తో గొడవ జరిగింది. మరుసటి రోజు తండ్రి యథావిధిగా విధులకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కేశంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తండ్రిని వెతికేందుకు ఈ నెల 3న నగరానికి వచ్చాడు. మధ్యలో తల్లికి ఫోన్ చేసి ఇంటికి వచ్చాడా లేదా అన్న సమాచారం అడిగి తెలుసుకునేవాడు. ఈ నెల 11న చంద్రశేఖర్‌రావు బడంగ్‌పేటలోని దుర్గా వైన్స్ సమీపంలో పెట్రోల్ పోసుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి శోభారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పహాడీషరీఫ్: బాలుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రంగ నాయకుల కాలనీకి చెందిన శివ కుమారుడు రాకేష్(24) ఈ నెల 11న మధ్యాహ్నం తల్లి ఎల్లమ్మ డ్యూటీకి వెళ్లే సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. రాత్రి వచ్చి చూడగా కనిపించలేదు. అతని ఆచూకీ కోసం స్థానికంగా వాకబు చేయగా తుక్కుగూడ వైపు ఆటోలో వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై తల్లి మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాడ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గానీ, 87126 62367 నంబర్‌లోగానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.
షాబాద్: రెండు దుకాణాల్లో చోరీ జరిగి రూ.లక్ష వరకు నష్టం జరిగింది. ఈ సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌లోని రెండు పాన్‌షాపుల్లో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి కౌంటర్లలో ఉన్న నగదుతోపాటు, వస్తువులన్నీ తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుల్కచర్ల: బెంగళూరులో జరిగిన చోరీ సొత్తును మండల కేంద్రమైన కుల్కచర్లలో రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుల్కచర్లలో బుడ్డరాం, సురేష్, కై లాస్ నగల దుకాణం నిర్వహిస్తున్నారు. సురేష్, కై లాస్ రాజస్థాన్‌కు చెందిన మరో ముగ్గురు బెంగళూరు కమిషనరేట్ పరిధిలోని బెలున్‌ఘట్ ప్రాంతంలో ఏప్రిల్ 27న ఓ నగల దుకాణంలో 70కిలోల వెండిని చోరీ చేశారు. అక్కడి పోలీసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వారు కుల్కచర్లకు చెందిన సురేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. చోరీ చేసిన వెండిని కుల్కచర్లలోని కేసరియా జ్యువెలర్స్, బుడ్డరాం ఇంటిలో స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో 4 కిలోల 600 గ్రాములు, దుకాణంలో మరో 6కిలోలు లభ్యమైంది.


