న్యూస్‌రీల్
మొయినాబాద్: ఓ బంక్ వద్ద క్యూకట్టిన వాహనదారులు
మళ్లీ అదే వరుస!
ఇంధనం కష్టాలు మళ్లీ షురూ అయ్యాయి.. జిల్లాలోని పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. మరి కొన్ని బంకుల్లో వాహనదారులు బారులు తీరి కనిపిస్తున్నారు.. ముందు జాగ్రత్తగా ట్యాంక్‌లు ‘ఫుల్’ చేయిస్తున్నారు.. ఎందుకై నా మంచిదని ఏకంగా క్యాన్లు, వాటర్ బబుల్స్‌లో నింపుకెళ్తున్నారు.. ఒకవైపు ఎలాంటి కొరత లేదని పౌరసరఫరాల శాఖ ప్రకటనలు చేస్తున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
– షాద్‌నగర్/చేవెళ్ల/మొయినాబాద్/కొత్తూరు/తుక్కుగూడ
పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు మళ్లీ క్యూ కడుతున్నారు. జిల్లాలోని చాలా బంకుల్లో స్టాక్ లేకపోవడంతో మూసివేశారు. ఇంధనం అయిపోయిన వారు ఖాళీ బాటిళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఇంధనం కొరత లేదని ఓ వైపు అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో సామాన్యులు, రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. రోజూ సరఫరా చేసే చమురు కంపెనీలు మూడు, నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్లను పంపిస్తున్నారని, దీంతో సమస్య తలెత్తుతోందని బంకుల యజమానులు చెబుతున్నారు.
నిల్వలు నిండుకొని..
ఇంధనం నిల్వలు సరిపడా లేకపోవడంతో పెట్రోల్ బంక్‌ల వద్ద నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయిల్ కంపెనీల నుంచి సరఫరాలో జాప్యంతో చాలా బంకుల్లో కొరత ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 349 పెట్రోల్ బంకులు ఉన్నాయి. నిల్వలు నిండుకోవడంతో వీటిలో చాలా బంకులు మూతపడ్డాయి. మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఎక్కడ చూసినా నోస్టాక్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని బంకుల్లో స్టాక్ వచ్చిన వెంటనే వాహనదారులు క్షణాల్లో బారులు తీరుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల యజమానులు అత్యవసర సేవలకు వినియోగించే వాహనాల కోసం కొంత స్టాక్ నిల్వ చేసుకొని వారికి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు చేసుకునే సమయం కావడంతో ఇంధనం లేక రైతులు పాట్లు పడుతున్నారు.
పొంతలేని ప్రకటనలు
ఇంధనం కొరత లేదని ఆయిల్ కంపెనీలు, అధికారులు ప్రకటిస్తున్నారు. వారు చెప్పే మాటలు, ప్రకటనలకు పొంతన లేకుండా ఉంది. మరోవైపు ఇంధన కొరతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిజంగానే తగ్గిపోయాయా లేక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎన్‌జీ, గ్యాస్ సిలిండర్ల కొరత
సీఎన్‌జీ, గ్యాస్ సిలిండర్ల కొరత కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. సీఎన్‌జీ కోసం బంకుల ముందు వాహనాలు బారులు తీరుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల దొరక్క వినియోగదారులు తంటాలు పడుతున్నారు. బుకింగ్ చేసినా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇంధనంపై ఆధారపడి జీవించే ఆటోవాలాలు, అద్దెకు కార్లు నడిపించే వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రయాణికులను ఒకచోట నుంచి మరో చోటికి తీసుకెళ్లాలంటే ఇంధనం తప్పనిసరని, లేదంటే పూడ గడవదని వాపోతున్నారు.
దొరకదన్న ప్రచారంతో..
ఇంధనం వచ్చిన బంకుల్లో వాహనదారులు క్యూ కడుతున్నారు. ఓ వైపు కొరతతో పాటు ఇంధనం దొరకదేమోననే ఆందోళనతో వాహనాదారులు ఏకంగా ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు పెట్రోల్, డీజిల్‌ను పట్టణాలకు వచ్చి మరీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
బంకుల్లో బారులు
‘నో స్టాక్’ బోర్డులు
వాహనదారుల కష్టాలు
కొరత లేదంటున్న అధికారులు
భిన్నంగా వాస్తవ పరిస్థితి
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
ఇబ్రహీంపట్నం రూరల్: పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రజలకు నమ్మకం కల్పించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని కొన్ని బంకుల్లో పరిస్థితిపై సోమవారం జిల్లా ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్స్‌తో టె లీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొద్ది మందికే ఎక్కువ మొ త్తంలో విక్రయించకుండా చూడాలన్నారు. అనవసరంగా కొనుగోలు చేసి కృత్రిమ కొరతకు కారణం కావొద్దని సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆధారపడి.. ఆందోళనకు గురై


