11న మెగా జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

11న మెగా జాబ్‌ మేళా

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

11న మెగా జాబ్‌ మేళా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బీజేపీ నేత ఆచారి ఘన నివాళి పెండింగ్‌ జీతాలు చెల్లించాలని వినతి రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

హుడాకాంప్లెక్స్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మే 11న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రముఖ పరిశ్రమ లు, ఐటీ కంపెనీలు, ఇతర సేవా రంగ సంస్థ లు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటా యని తెలిపారు. అర్హులైన నిరుద్యోగులు ఈ అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://satg.telangana.gov.in/prajapalana వెబ్‌ లింక్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఆమనగల్లు: ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌రెడ్డిని సోమవారం జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు, బీజేపీనేత ఆచారి కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కలిసిన ఆచారి ఈనెల 30న జరిగే తన కుమారుడు భరత్‌ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు.

బడంగ్‌పేట్‌: ఇటీవల మృతి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు తర్రె మల్లేష్‌యాదవ్‌, సర్కిల్‌ అధ్యక్షుడు రాళ్లగూడం రామకృష్ణారెడ్డి సంతాప సభ సోమవారం నాదర్‌గుల్‌లోని ఓ గార్డెన్‌లో నిర్వహించారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్‌, నియోజకవర్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: పంచాయతీ సిబ్బందికి రెండు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి గ్యార పాండు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పాండు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో పంచాయతీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని, అయినా వారికి రెండు నెలల వేతనాలు అందించడం లేదన్నారు. సిబ్బందిని 2వ పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలని, పాత కేటగిరీలన్నింటినీ కొనసాగించాలని, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా వచ్చిన సర్పంచ్‌లు ఆన్‌లైన్‌లో పేర్లు లేని కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని, కార్మికుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పోచమోని కృష్ణ, భాస్కర్‌, రజిత, బాలమణి, సరిత తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రైవేటు విద్యసంస్థల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేసి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి రెండున్న రేళ్లు దాటినా నిధులు మంజూరు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దశరథ, శ్రీనివాస్‌, జగదీష్‌, శ్రీకాంత్‌, ప్రసాద్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement