చేవెళ్ల: సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉగ్రరూపం చూపిన భానుడు సాయంత్రానికి ‘కూల్’ అయిపోయాడు. ఉక్కపోతతో అల్లాడినవారు కాస్తా ఉపశమనం పొందారు. సాయంత్రం 4 గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మబ్బులు కమ్ముకొని ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ పొలాల వద్ద పశువుల పాకలు, రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి.
చల్లబడిన వాతావరణం
మొయినాబాద్‌రూరల్: మండలంలోని ఆయా గ్రామాల్లో సాయంత్రం ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో జనం సేదదీరారు. మరోవైపు వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి.
ఈదురుగాలులతో కూడిన వర్షం
మొయినాబాద్: మండలంలో సాయంత్రం ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీస్తూ వర్షం పడింది. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరా నిలిచిపోయి అంతరాయం ఏర్పడింది. మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంతోపాటు సురంగల్, అమీర్‌గూడ, చిన్నషాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.


