65 శాతం మించని బియ్యం డ్రా
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఉచిత బియ్యం పరేషాన్ పట్టుకుంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాలు డ్రై (బియ్యం నిల్వలేని)గా మారుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల కోటాను ఒకేసారి విడుదల చేయడంతో డ్రా చేసేందుకు లబ్ధి కుటుంబాలు తీవ్ర అగచాట్లు పడుతున్నాయి. మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో బియ్యం అందుతాయో లేదోనని లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రేషన్ దుకాణాలు అరకొర వసతులతో, ఇరుకైన గదుల్లో కొనసాగుతుండటంతో తగినంత స్టోరేజ్ సామర్థ్యం లేకపోవడంతో సమస్యగా తయారైంది. దీంతో పౌరసరఫరాల శాఖ బియ్యాన్ని దశలవారీగా పంపిణీ చేస్తోంది. లోడ్ వచ్చిన మూడు, నాలుగు రోజుల్లోనే స్టాక్ నిండుకోవడంతో షాపులను మూసి వేస్తున్నారు. అప్పటికే వచ్చిన బియ్యం ఖాళీ కావడంతో వేచి చూసిన లబ్ధిదారులు రిక్తహస్తాలతో వెనుదిరగాల్సి వస్తోంది. స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలియక, కార్డుదారులు షాపుల చుట్టూ నిత్యం చక్కర్లు కొట్టాల్సి వస్తోంది.
గడువు ముగింపు వేళ సందిగ్ధం
ప్రస్తుత కోటా డ్రా చేయడానికి మరో మూడు రోజులే సమయం ఉండటంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది కార్డుదారులు రావడంతో షాపుల వద్ద రద్దీ పెరుగుతోంది. తమ కోటా సకాలంలో అందుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్న లబ్ధిదారులు, దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. డీలర్లు కూడా అస్పష్ట సమాధానాలు ఇస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది.
ఎండల్లో ప్రజల ఇబ్బందులు
తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా, తెల్లవారుజాము నుంచే రేషన్ కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. గంటల తరబడి వేచి చూసినా, చివరకు ‘స్టాక్ అయిపోయింది’ అనే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన మార్పులు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఎండల్లో రేషన్ లబ్ధిదారుల పడిగాపులు
ఉచిత బియ్యం పంపిణీలో అగచాట్లు
తరచూ నిండుకుంటున్న కోటా
ముంచుకొస్తున్న గడువు
మిగిలింది ఇక మూడు రోజులే
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సుమారు 21.46 లక్షల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు ఉచిత బియ్యం డ్రా చేసిన కుటుంబాల సంఖ్య 70 శాతం మించలేదు. మిగతా కుటుంబాలు కోటా డ్రా కోసం రేషన్ షాపుల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సాధారణంగా ప్రతి నెలా సుమారు 85 నుంచి 90 శాతం కుటుంబాలు సరుకులు డ్రా చేస్తుంటాయి. వివిధ కారణాలతో మిగతా 10 నుంచి 15 శాతం కోటా డ్రా కాదు. కేవలం మూడు రోజుల్లో సుమారు 15 నుంచి 20 శాతం వరకు లబ్ధి కుటుంబాలు ఉచిత కోటా డ్రా చేయాల్సి ఉంది.


