వాసవీమాతకు ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

వాసవీమాతకు ప్రత్యేక పూజలు

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

మీర్‌పేట: అహింస ధర్మం ఆత్మ త్యాగానికి ప్రతీకగా ఆర్యవైశ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి రోజు ఆలయాన్ని ప్రారంభించుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. వైశ్యులంతా ఐకమత్యంగా ఉండి ఏటా వాసవి మాత జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. మీర్‌పేట దీన్‌దయాల్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన వాసవీ మాత విగ్రహ ప్రతిష్ఠ, జయంతి వేడుకలకు ఆదివారం ఆమె హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. వాసవిమాత సంకల్పంతోనే దేవాలయ నిర్మించడం జరిగిందని, ఆ నిర్మాణంలో తన పాత్ర ఉండడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మిషన్‌ భగీరథ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేశ్‌గుప్తా మాట్లాడుతూ.. ఆలయానికి భూమిని కేటాయించిన సబితారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బాలాపూర్‌ మండలంలో పేద వైశ్య విద్యార్థుల చదువు కోసం విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తనవంతు సాయంగా రూ.50 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్‌ తెరేటిపల్లి శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ.. ఆలయాన్ని నిత్యాన్నదాన కేంద్రంగా తీర్చడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి సురేష్‌గుప్తా, గందే వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్‌గుప్తా, మండల అధ్యక్షుడు నాళ్ల శ్రీనివాస్‌గుప్తా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement