ఇబ్రహీంపట్నం రూరల్: జనగణన మొదటి దశ ఇళ్ల జాబితా, ఇళ్ల గణన స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలు, అధికారులు బాధ్యతగా పాల్గొనాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్‌ఓ సంగీతతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యావంతలు, ప్రజలు అందరూ స్వీయ నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుందన్నారు. భారత ప్రభుత్వం జన గణన ప్రక్రియను రెండు దశల్లో చేపడుతోందని తెలిపారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణన చేస్తారని చెప్పారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి 28వ తేదీ వరకు జనాభా గణన, కుల గణన ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి ఇళ్ల గణన స్వీయ నమోదు ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. ఇళ్లగణన కోసం మీ ఇంటి వద్దకు వచ్చే అధికారికి వివరాలు తెలియజేయాలని కోరారు. అధికారులకు సరైన సమాచారం ఇచ్చి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. నమోదు చేసిన వివరాలను స్క్రీన్‌షాట్ తీసుకొని భద్రపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సెన్సస్ ఇన్‌చార్జి శిరీష, ఎన్నికల సెన్సస్ విభాగం అధికారి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


