ఆమనగల్లు: ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రవాణ, బీసీ, సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానం వెళ్తున్న ఆయనకు ఆదివారం ఆమనగల్లు పట్టణంలో పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలైందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా అన్ని రూట్లలో బస్సులను పెంచినట్లు పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అభ్యర్థన మేరకు కల్వకుర్తి డిపోకు 20 కొత్త బస్సులు కేటాయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షాబుద్దీన్, వస్పుల శ్రీకాంత్, ఫరీద్, సురేశ్, అలీం తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్


