ఆమనగల్లు: ఓ మహిళను రుణం ఇప్పిస్తానంటూ మభ్యపెట్టి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాన్ని అపహరించిన దొంగ పోలీసులకు చిక్కాడు. ఆమనగల్లు ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉల్పర గ్రామానికి చెందిన ముగురాల రాజేందర్‌గౌడ్ అలియాస్ రాజు అలియాస్ గోలి శివ పాత నేరస్తుడు. గతంలో వివిధ పోలీసు స్టేషన్లలో తొమ్మిమది కేసులు నమోదై ఉన్నాయి. ఈనెల 21న నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లకు చెందిన ఓ మహిళకు రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. తన బైక్‌పై ఎక్కించుకుని ఆమనగల్లు సమీపంలోని చింతలపల్లి సరిహద్దులో ఆమెను బెదిరించి మెడలో ఉన్న రూ.31 వేల విలువైన బంగారు ఆభరణాన్ని లాక్కున్నాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఆమనగల్లు పట్టణంలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి సెల్‌ఫోన్, మోటార్‌బైక్ స్వాధీనం చేసుకున్నారు.


