● సముద్రాన్ని ఈదిన నగర మహిళ
● 10.10 గంటల్లో శ్రీలంక నుంచి రామేశ్వరం చేరుకుని రికార్డు
కాచిగూడ: అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా (45) మరో రికార్డును నెలకొల్పారు. కాచిగూడకు చెందిన క్వీనీ విక్టోరియా శ్రీలంకలోని తలైమీనార్ నుంచి తమిళనాడు రామేశ్వరం ధనుస్కోడి వరకు ఐదుగురు మహిళలతో కలిసి సముద్రాన్ని ఈది రికార్డును నెలకొల్పారు. గంధం క్వీనీ విక్టోరియా సారధ్యంలో న్యూఢిల్లీకి చెందిన ఆర్సీ (42), తెలంగాణకు చెందిన మౌనిక (34), మహారాష్ట్రకు చెందిన స్మిత (52), విజయవాడకు చెందిన ధాత్రిక మండప (48)లు మహిళలు శ్రీలంకలోని తలైమినార్‌లో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు స్విమ్మింగ్ ప్రారంభించి రామేశ్వరం ధనుస్కోడికి మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకున్నారు. 59 కిలోమీటర్ల దూరాన్ని 10గంటల 10 నిమిషాలలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. ఐదుగురు మహిళలకు కలిసి రామసేతువును ఈడదం ఇదే మొదటిసారి.
ఈత నేర్చుకునేందుకు వెళ్లి..
● అనంతలోకాలకు చిన్నారి
● మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
● దిర్సంపల్లిలో విషాదం
దోమ: ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చెందిన కారవొని నాగేశ్‌కు ఏడేళ్ల బాలుడు శివకుమార్ ఉన్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కొయిలకొండ మండలం కొత్లాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం పెద్దనాన్నతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. అందరూ చూస్తుండగా శివకుమార్ బావిలోకి దూకాడు. ఎంతసేపటికీ బయటికి రాలేదు. దీంతో అక్కడే ఉన్న కొందరు గాలింపు చర్యలు చేపట్టారు. నీట మునిగిన బాలుడిని బయటికి తెచ్చారు. అప్పటికే శివకుమార్ చనిపోయాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
బాలిక బలవన్మరణం
బంట్వారం: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కోట్‌పల్లి మండలం నాగసాన్‌పల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన బాలికను ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో బాలిక రెండు రోజుల కిందట ఇంట్లోనే పురుగు మందు తాగింది. కుటుంబీకులు వెంటనే వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు సంగారెడ్డిలోని మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శైలజ తెలిపారు.


