శంకర్‌పల్లి: ఆర్టీసీ బస్సు, యూ టర్న్ చేస్తున్న వాటర్ ట్యాంకర్‌ని బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటన మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరబాబు కథనం ప్రకారం.. మెహిదీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి శంకర్‌పల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరింది. జన్వాడ గ్రామ శివారులోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద రాగానే.. ఓ వాటర్ ట్యాంకర్ యూటర్న్ తీసుకుంటోంది. అతి వేగంతో ఉన్న బస్సు ట్యాంకర్‌ని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ క్యాబిన్ భాగం భారీగా దెబ్బతింది. డ్రైవర్ రవీందర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఫైర్ ఇంజన్‌ని పిలిపించారు. గ్యాస్ కట్టర్ సాయంతో క్యాబిన్ భాగాన్ని తొలగించి, డ్రైవర్‌ని బయటకు తీశారు. డ్రైవర్ కాలు విరగ్గా, కండక్టర్ ముక్కుకి, ప్రయాణికుడికి గాయాలయ్యాయి. అనంతరం వీరిని చికిత్స నిమిత్తం నార్సింగిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికుడికి గాయాలు


