సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆస్తుల అసెస్‌మెంట్లు, పన్నుల వసూళ్లలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మార్చి 31తో ఈ పన్నుల వసూళ్లకు గడువు తీరింది. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో పన్నులు వసూలు కాలేదు. ఆమనగల్లు మున్సిపాలిటీలో 53.59 శాతం, ఇబ్రహీంపట్నంలో 57.51 శాతం, శంకర్‌పల్లిలో 58.64 శాతం, కొత్తూరులో 62.59 శాతం దాటలేదు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. కళ్లప్పగించి చూడడం, ఆ తర్వాత ఆస్తుల అసెస్‌మెంట్లలో చేతివాటాన్ని ప్రదర్శిస్తుండటంతో మున్సిపాలిటీలకు రావాల్సిన స్థాయిలో ఆదాయానికి గండిపడుతోంది. ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్లు, విద్యా, వ్యాపార సంస్థలు, గోదాంలు, హోటళ్లు, ఫాంహౌస్‌లు, రిసార్ట్‌ల నుంచి పన్నులు వసూలు చేసే విషయంలోనూ చేతివాటం ప్రదర్శిస్తూ మున్సిపాలిటీ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి.
అన్నింటికి అంతర్గత వనరులే దిక్కు
ఏడు మున్సిపాలిటీల పరిధిలో 56,112 ఆస్తులకు అసెస్‌మెంట్ చేయగా, వాటి నుంచి రూ.38.51 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు వసూళ్లు రూ.26.80 కోట్లకు మించలేదు. ఏడాది కాలంగా ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగడం, పాలకమండళ్లు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు సైతం రాలేదు. దీంతో సిబ్బంది వేతనాల చెల్లింపులు సహా ఇతర ఖర్చులకు ఈ అంతర్గతవనరులే దిక్కుగా నిలిచాయి. ఆశించిన స్థాయిలో పన్నులు వసూలు కాకపోవడం, ఖాతాల్లో నిధులు లేకపోవడంతో సకాలంలో సిబ్బంది వేతనాలు చెల్లించలేని పరిస్థితి. నిధుల లేమితో ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణం వంటి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని దుస్థితి. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఆయా మున్సిపాలిటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
● మొయినాబాద్ మున్సిపాలిటీ పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. అనేక చోట్ల బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, కన్వెన్షన్లు, విద్యా, వ్యాపార సంస్థలు వెలుస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 12 వేలకు పైగా నిర్మాణాలున్నారయి. అయితే వెయ్యిలోపు ఆస్తులకు మాత్రమే అసెస్మెంట్‌లు జారీ చేశారు. మిగిలిన వాటికి నోటీసులు జారీ చేసి చేతులుదులుపుకొన్నారు. నిర్మాణ సమయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తూ.. ఆ తర్వాత ఆయా నిర్మాణదారులు ఇంటి నంబర్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
● శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శంకర్‌పల్లి మున్సిపాలిటీలో పది వేలకుపైగా ఆస్తులున్నట్లు అంచనా. కానీ ఇక్కడి అధికారులు 7.5 వేలలోపు ఆస్తులకు మాత్రమే అసెస్మెంట్లు చేశారు. ఆస్తుల అసెస్‌మెంట్లు, వసూళ్లలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు, ఫంక్షన్‌హాల్స్‌కు, కన్వెన్షన్లు, విద్యా, వ్యాపార సంస్థలకు భారీగా పెనాల్టీ విధించే అవకాశం ఉంది. కానీ టీపీఓ అధికారులు అడిగినంత ముట్టజెప్పితే చాలు విల్లా ప్రాజెక్టులు, బహుళ అంతస్తుల భవనాలకు కూడా అసెస్మెంట్లు తగ్గిస్తున్నారు.
ఆస్తి పన్ను వసూళ్లలో అలసత్వం
వెనుకబడిన ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, శంకర్‌పల్లి మున్సిపాలిటీలు
ఆస్తుల అసెస్‌మెంట్లలో టీపీఓల చేతివాటం
మున్సిపల్ ఆదాయానికి గండి
ఖాతాల్లో జమకాని 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు
మున్సిపాలీటీల వారీగా ఆస్తిపన్ను వసూళ్ల వివరాలు రూ.కోట్లలో
మున్సిపాలిటీ అసెస్‌మెంట్లు పన్నుల డిమాండ్ వసూలు శాతం
ఆమనగల్లు 5,684 2.09 1.12 53.59
చేవెళ్ల 6,050 3.60 2.82 92.16
ఇబ్రహీంపట్నం 7,456 9.46 5.44 5.51
కొత్తూరు 2,857 4.41 2.76 62.59
మొయినాబాద్ 9,967 5.82 4.73 81.27
షాద్‌నగర్ 16,625 8.31 6.69 80.51
శంకర్‌పల్లి 7,473 5.36 3.14 58.64
మొత్తం 56,112 38.51 26.80 69.47


