ఆరోగ్యమే.. మహాభాగ్యం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమే.. మహాభాగ్యం

Apr 9 2026 9:23 AM | Updated on Apr 9 2026 9:23 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలి

సురక్షిత మాతృత్వ దినోత్సవంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆరోగ్యమే మహాభాగ్యమని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మార్చి 6 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఎల్మినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సురక్షిత మాతృత్వ దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్వం శారీరక వ్యాయామం ఉండేదని.. మారుతున్న అలవాట్లకనుగుణంగా శారీరక వ్యాయామం తగ్గిందన్నారు. మానసిక ఒత్తిడి కారణంగా చిన్న వయస్సులోనే వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. గర్భిణులు తగిన జాగ్రత్తలు, సరైన పోషకాహారం తీసుకుంటూ ఆశ వర్కర్ల సాయంతో మెరుగైన వైద్య సేవలు పొందాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల ప్రసవాలు 57 శాతం ఉండేవని గుర్తు చేశారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని వైద్యాధికారులకు, సిబ్బందికి సూచించారు. ఒక మహిళకు గర్భనిర్ధారణ అయిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.

డ్రగ్స్‌ నివారణ చర్యలు చేపట్టండి

డ్రగ్స్‌, గంజాయి గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకిందన్నారు. దీంతో యువత వ్యసనాలకు లోనై జీవితాలను పాడుచేసుకుంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రగ్స్‌, గంజాయి సంస్కృతి పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశ కార్యకర్తలకు, ఏఎన్‌ఎంలకు సూచించారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ కేంద్రం పరిశీలన

ఎల్మినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి సర్టిఫికేట్‌ అందజేశారు. ఈ వ్యాక్సిన్‌ వల్ల మహిళల్లో సాధారణంగా వచ్చే గర్భాశయ ముఖ క్యాన్సర్‌ నుంచి నివారించడానికి ఉపయోగపడుతుందన్నారు. 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలు టీకా తప్పక వేయించాలన్నారు.

అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు

అనంతరం ఆయన అంగన్‌వాటీ టీచర్లకు 4జీ సెల్‌ఫోన్లను అందజేశారు. అంగన్‌వాడీల్లో ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభమయ్యాయని వాటిని సెల్‌ఫోన్‌ ఆధారంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ యాదమ్మ, డీఆర్‌డీఓ పీడీ శ్రీలత, డీఎంహెచ్‌ఓ లలితాదేవి, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రాధిక, డాక్టర్‌పూనం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ లక్ష్మీప్రసన్న, వైద్యాధికారులు డాక్టర్‌ మోహన్‌, రాజ్యలక్ష్మి, సంతోషి, డెమో శ్రీనివాసులు, వైద్య సిబ్బంది వార్డు సభ్యులు పట్నం భాష, నర్సింహ, రాంరెడ్డి, విజయేందర్‌ పాల్గొన్నారు.

మీర్‌పేట: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ బుధవారం బాలాపూర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సురక్షితమైన మాతృత్వంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆస్పత్రిలో అందుతున్న ప్రసూతి సేవల గురించి గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి ఇంకా ఏమైనా సదుపాయాలు అవసరం ఉన్నాయా అని సిబ్బందిని ఆరాతీశారు. ఆయన వెంట జిల్లా ఉప వైద్యాధికారి గీత, ఆస్పత్రి వైద్యులు బాలమణి, శ్రీహరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement