పహాడీషరీఫ్: మామిడిపల్లి గ్రామంలోని నాలాలు, కుంటలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. పలు కుంటలు ఆక్రమణకు గురయ్యాయంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యలంలో నీటి పారుదల, రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఒంగరోని కుంట, మర్రివాని కుంట, నల్లవాగు నాలాల పరిసరాలలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. ఆయా కంపెనీలు కుంటలు, నాలాలను ఆక్రమించాయని ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఈ సందర్భంగా అధికారులు రికార్డులో ఉన్న విస్తీర్ణం, ప్రస్తుతం ఉన్న విస్తీర్ణాన్ని పరిశీలించారు. ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. నివేదిక వచ్చాక వెంచర్ల నిర్వాహకులు తామంతట తాము కూల్చేసుకుంటే సరి, లేదంటే హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపడుతామన్నారు. ఆయన వెంట నీటి పారుదల శాఖ డీఈ నారాయణ, ఏఈ వంశీ, వర్క్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
కుంటలు, నాలాల
ఆక్రమణల పరిశీలన


