● త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
● ఇక ఏప్రిల్‌లోనే మెట్రో స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో టేకోవర్‌పై మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్న తాధికారులతో సమీక్షించారు. టేకోవర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి 31వ తేదీ లోపు మెట్రో మొదటి దశ టేకోవర్‌కు ప్రభుత్వం గడువు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ గడువులోగా స్వాధీన ప్రక్రియ పూర్తి కాకపోవడం రుణాల చెల్లింపులపైనా స్పష్టత లేకపోవడంతో జాప్యం నెలకొంది. ఈ క్రమంలో సీఎం మెట్రో టేకోవర్‌పైన సమీక్షించారు. మార్చి 31వ తేదీ గడువు ముగిసినందున ఇక ఏప్రిల్‌లో అది పూర్తయ్యే అవకాశముంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో నిర్మించిన మెట్రో మొదటి దశ నిర్వహణ భారం దృష్ట్యా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా కొనసాగలేమంటూ గతేడాది సెప్టెంబర్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకొనేందుకు ముందుకు వచ్చింది. మెట్రో రెండోదశ నిర్మాణానికి ఎదురైన సాంకేతిక ఆటంకాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొంది. అప్పటి నుంచి వివిధ దశల్లో చర్చలు, సమీక్షలు జరిగాయి. ఆర్థిక అంచనాలపై ఐడీబీఐ, సాంకేతిక అంశాలపై ఢిల్లీ మెట్రోరైల్ సంస్థలు సమగ్రమైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయి. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన రూ.13 వేల కోట్లను తక్కువ వడ్డీతో రీఫైనాన్స్ చేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్‌ఎఫ్‌సీ) సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఎల్‌అండ్ టీకి అందజేయాల్సిన రూ.2 వేల కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం కూడా లభించింది. రుణాల చెల్లింపుతోపాటు ఎల్‌అండ్ టీ ఈక్విటీ చెల్లింపు వంటి ప్రక్రియలను త్వరలో పూర్తి చేసి ప్రాజెక్టును స్వాధీనం చేసుకోనున్నారు.
దాచిన 13 ఎల్‌పీజీ సిలిండర్ల పట్టివేత
శంషాబాద్: వంటగ్యాస్ కొరతే అక్రమార్కులకు వరమైంది. శంషాబాద్ సర్కిల్‌లో మంగళవారంరాత్రి టాస్క్‌ఫోర్స్ దాడుల్లో పక్కదారి పట్టిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు పట్టుబడింది. వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో రవి అనే కిరాణా వ్యాపారి ఇంట్లో దాచిన 13 ఎల్‌పీజీ సిలిండర్లు, సుమారు ఎనభై లీటర్ల పెట్రోలును టాస్క్ ఫోర్సు అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. అతడిపై గతంలో ప్రజాపంపిణీ బియ్యం విక్రయానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి.
అగ్ని ప్రమాదం
రెండు ద్విచక్ర వాహనాలు, ఆటో దగ్ధం
చందానగర్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో విద్యుదాఘాతం ఏర్పడటంతో కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండనగర్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఆటో, రెండు ద్విచక్రవాహనాలకు మంటలంటుకుని దగ్ధమయ్యాయి. పక్కన ఉన్న రెండు భవనాలు మంటలకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే బస్తీ ప్రజలు స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ సంఘటనాస్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడి త్వరతగతిన విద్యుత్‌ను పునరుద్ధరించాలని కోరారు.


