కొత్తగా మరో..
సాక్షి, రంగారెడ్డి జిల్లా:
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జిల్లాలో కొత్తగా మరో ఐదు అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 24,46,265 మంది ఉండగా, 2024 డిసెంబర్ నాటికి కేవలం 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్యే 35,91,987కు చేరడం గమనార్హం. వీరిలో 526 గ్రామ పంచాయతీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఉన్నారు. మిగిలిన 25,51,793 మంది పూర్తిగా నగరంలోనే ఉన్నారు.
శేరిలింగంపల్లిలో రెండు
అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో శేరిలింగంపల్లి మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఉన్నాయి. చేవెళ్ల, కల్వకుర్తి, షాద్‌నగర్‌లలో రెండున్నర లక్షల లోపు ఓటర్లు మాత్రమే ఉన్నారు. అత్యధిక ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి గచ్చిబౌలి, మియాపూర్ కేంద్రాలుగా మరో రెండు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది.
ఆ నాలుగింట్లో మరో మూడు
రాజేంద్రనగర్‌లో కొత్తగా శంషాబాద్ ఏర్పడనుంది. మహేశ్వరం నుంచి కొత్తగా సరూర్‌నగర్ పేరుతో మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్బీనగర్ నుంచి కొత్తగా హయత్‌నగర్ పేరుతో మరో నియోజకవర్గం పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో కొంత భాగాన్ని కూడా దీనిలో కలిపే చాన్స్ లేకపోలేదు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ఎనిమిది నియోజకవర్గాల సంఖ్య 13కు చేరే అవకాశం ఉంది. ఈ మేరకు కొత్త నేతలకు అవకాశాలు లభించనున్నాయి.
2024 డిసెంబర్ నాటికి ఓటర్లు ఇలా..
నియోజకవర్గం ఓటర్లు
చేవెళ్ల 2,02,005
కల్వకుర్తి 2,41,762
షాద్‌నగర్ 2,36,338
ఇబ్రహీంపట్నం 3,27,589
మహేశ్వరం 5,46,577
రాజేంద్రనగర్ 5,81,937
ఎల్బీనగర్ 5,93,712
శేరిలింగంపల్లి 7,32,506
జిల్లా పరిధిలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
త్వరలో నియోజకవర్గాల పునర్విభజన!
8 నుంచి 13కు చేరే అవకాశం
మారనున్న రాజకీయ ముఖచిత్రం


