శంకర్‌పల్లి: దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. మండలంలోని ప్రొద్దటూరులో మంగళవారం నిర్వహించిన పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలోని కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మండల, మున్సిపల్ అధ్యక్షులు లీలావతి, దయాకర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రాములు, పరమేశ్వర్‌రెడ్డి, సురేశ్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.1.81 కోట్లు పలికిన తైబజార్ వేలం
తుక్కుగూడ: తైబజార్ (వారపు పశువుల సంత) బహిరంగ వేలం 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను మంగళవారం తుక్కుగూడ వార్డు కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్వహించారు. ఈ వేలంలో రూ.కోటి 81 లక్షల 71 వేలకు రావిర్యాల గ్రామానికి చెందిన బోధ పాండురంగారెడ్డి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా శంషాబాద్ సర్కిల్ డీసీ సుమన్‌రావు పాండురంగారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో శంషాబాద్ సర్కిల్ ఎస్టేట్ అధికారి టి.పర్వతాలు, టీఐ మల్లేష్, వ్యాపారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించండి
ఆమనగల్లు: హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు రోడ్డును ఆరులేన్లుగా విస్తరించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మంగళవారం హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణపై మాట్లాడారు. రోడ్డు రెండు లేన్‌లుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణకు నిధులు మంజూరయ్యాయా.. అయితే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై ఫిల్మ్‌సిటీ దాటిన తరువాత కిలోమీటర్ దూరంలో విద్యాసంస్థలు అధికంగా ఉన్నాయన్నారు. విద్యార్థులు రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడుతున్నందున ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.


